ఇక నేరం చేసినవారు తప్పించుకోలేరు..!

Update: 2018-08-02 11:29 GMT

టెక్నాలజీతో క్రైమ్ ను కంట్రోల్ చేయడంలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు రాష్ట్ర పోలీసులు. సాంకేతిక పరిజ్ఞనంతో నేరగాళ్లకు చెక్ పెడుతున్నారు. తమ దగ్గరున్న పాత నేరస్తులు, అంతరాష్ట్ర దొంగల ముఠాల డేటా బేస్ తో సిటీలో నేరగాళ్ల కధలికలు గమనిస్తున్నారు. ఫేషియల్ రికగ్నేషన్ సాఫ్ట్‌ వేర్‌ను ఉపయోగించి రైల్వే స్టేషన్లు, బస్ట్ స్టేషన్లలో తిరుగుతున్న క్రిమినల్స్ ను గుర్తిస్తున్నారు. నేరాల సంఖ్యను తగ్గించేందుకు చేసే ప్రయత్నంలో మరో ముందడుగు వేశారు. ఇప్పటికే సిటీలో అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఓ వైపు ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూనే మరోవైపు క్రిమినల్స్ కోసం వేట ప్రారంభించారు. అందుకోసం అధునాత టెక్నాలజీతో రూపొందించిన ఫేషియల్ రికగ్నేషన్ ల్యాబ్ ను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ తో ఫేస్ ను బట్టి నేరగాళ్లను గుర్తిస్తున్నారు. సిటీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలు ఈ ల్యాబ్ కు అనుసంధానం చేసి అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెట్టారు... దీనిని టీఎస్ కాప్ పోలీస్ యాప్ కు అనుసంధానం చేశారు.

సీసీ కెమెరాలతో అనుసంధానం చేసి...

పోలీస్ క్రైమ్ రికార్డుల్లో ఉన్నపాత నేరస్తుల ఫోటోలు, ఫింగర్ ప్రింట్స్ డేటాను ఈ ల్యాబ్ తో అనుసంధానం చేసిన సిటీ పోలీసులు...అంతర్రాష్ట్ర దొంగలు, క్రిమినల్స్ కదలికలపై గట్టి నిఘా పెట్టారు. లక్షకు పైగా నేరగాళ్ల డేటాను ఈ ఫేషియల్ రికగ్నేషన్ ల్యాబ్ లో పొందుబర్చారు. సీపీ కార్యాలయంలోని IT సెల్ లో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ను రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల, పబ్లిక్ ప్లేసుల్లోని సీసీ కెమెరాలతో కనెక్ట్ చేసారు. దీంతో ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి విజువల్స్, ఫోటోలను ఈ ఫేషియల్ ల్యాబ్ తో మ్యాచ్ చేసి చూస్తున్నారు. అందుకోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో హైడెఫినేషన్ కెమెరాలను ఏర్పాటు చేసి నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టారు. ఇలా సీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ ఫేషియల్ రికగ్నేషన్ ల్యాబ్ తో పాత నేరస్తులను గుర్తిస్తున్న పోలీసులు...ఒకవేళ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో అనుమానితులు ఎవరైనా కనిపిస్తే తమ దగ్గరున్న ఫోటోలతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. ఒకవేళ సీసీ ఫుటేజ్ ల్లో విజువల్స్ తమ దగ్గరున్ననేరస్తుల ఫోటోలతో మ్యాచ్ అయితే వాళ్లు ఎక్కడికి వెళ్లారు.. ఎం చేస్తున్నారు అనే విషయాలు ఆరా తీస్తున్నారు.

సభలు...ఉత్సవాలైనా...

దీంతో అనేక నేరాల్లో నేరగాళ్లను ఈజీగా పట్టుకుని జైలుకు పంపుతున్నారు పోలీసులు. దీంతో పాటు అంతర్రాష్ట్ర ముఠాలు సిటీలోకి ఎంటర్ అయితే తమ సిబ్బందిని అలెర్ట్ చేసి దోపిడీలు, చైన్ స్నాచింగ్ లు జరుగకుండా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఏవైనా బహిరంగ సభలు, ఉత్సవాలు జరిగితే పబ్లిక్ ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో... ఈ ల్యాబ్ కు అందించే పుటేజ్ తో లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. దీంతో పాటు ఒకేసారి వందలాది కెమెరాల నుంచి వచ్చే ఫుటేజీలను పరిశీలిస్తూ, ఫేషియల్ రికగ్నేషన్ సాఫ్ట్‌ వేర్‌ తో క్రైమ్ ను కంట్రోల్ చేస్తున్నారు.

మిస్సింగ్ కేసులు సులభంగా ఛేదించేందుకు...

ఇక వీటి ద్వారా మిస్సింగ్ కేసులను సైతం డిటెక్ట్ చేసే విధానాన్ని రూపొందించారు. చాలా చోట్ల మిస్సింగ్ కేసులు తరచూ వస్తూనే ఉంటాయి... ముఖ్యంగా చిన్నపిల్లల మిస్సింగ్ లలో అనేక ఫోటోలు క్రైం డేటా బేస్ లో పొందుపరిచి ఉంటారు. వాటిని ఈ ఫేస్ రికగ్నైషన్ తో అనుసంధానం చేస్తే దర్యాప్తు చేసే అధికారులకు సులభంగా ఉండటమే కాక తొందరగా గుర్తించవచ్చు. ఇప్పటికే ఈ సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నైజేషన్ ల్యాబ్ లాంటి అధునాతన టెక్నాలజీతో హైదరాబాద్ ను సేఫ్ సిటీగా మార్చుతున్న పోలీసులు....రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కనెక్ట్ చేయనున్నారు.

Similar News