బిగ్ బ్రేకింగ్ : జగన్ కేసులో చంద్రబాబుకు నోటీసులు

Update: 2018-11-13 08:19 GMT

తనపై జరిగిన హత్యాయత్నం కేసులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎనిమిది మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుతో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీకి, సీఐఎస్ఎఫ్, ఎయిర్ పోర్టు అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఘటన తర్వాత చంద్రబాబు, డీజీపీ చేసిన వ్యాఖ్యలు విచారణను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని జగన్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఆపరేషన్ గరుడ కూడా....

ఇందుకు సంబంధించి టీవీలో ప్రసారమైన వీరి వ్యాఖ్యల పుటేజీని కూడా కోర్టుకు సమర్పించారు. జగన్ పై దాడి జరుగుతుందని నటుడు శివాజి ముందే ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ముందే చెప్పాడని, ఆయనను కూడా విచారించాలని జగన్ తరపు న్యాయవాది సీ.వి.మోహన్ రెడ్డి కోర్టును కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అజమాయిషీ లేని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోర్టును కోరారు. దీనిపై చంద్రబాబు సహా ఎనిమిది మందికి కోర్టు నోటీసులు జారీ చేసి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Similar News