బ్రేకింగ్ : ప్రణయ్ హత్యలో కొత్త కోణాలు..!

Update: 2018-09-15 06:50 GMT

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిన్న జరిగిన పరువు హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కూతురు ప్రణయ్ అనే యువకుడిని కులాంతర వివాహం చేసుకోవడం భరించలేని మారుతీ రావు అల్లుడు ప్రణయ్ ను సుఫారీ గ్యాంగ్ తో హత్య చేయించాడు. హైదరాబాద్ కు చెందిన సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను చంపడానికి రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదను చూసిన గ్యాంగ్ సభ్యులు నిన్న ప్రణయ్ భార్య అమృతవర్షిణిని మిర్యాలగూడలోని ఆసుపత్రికి తీసుకెళ్లి బయటకు వస్తుండగా ప్రణయ్ ను తల్వార్ తో హత్య చేశాడు.

పక్కా ప్రణాళికతోనే...

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న నల్గొండ పోలీసులు వెంటనే విచారణ వేగవంతం చేశారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితులు హత్య జరిగిన తర్వాత హైదరాబాద్ పారిపోయినట్లు తెలిసింది. హత్యలో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మిర్యాలగూడకు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. ఇక హత్య జరగడానికి అరగంట ముందే మారుతీరావు(ఏ1), ఆయన సోదరుడు శ్రవణ్(ఏ2) హైదరాబాద్ కు పారిపోయినట్లు సీసీటీవీ విజువల్స్ లో తెలిసింది. అయితే, వివాహం జరిగిన కొంతకాలం తర్వాతి నుంచి మారుతీరావు కూతురు అమృతతో మాట్లాడుతున్నాడని తెలిసింది. రెండుమూడు సార్లు ప్రణయ్ తోనే మాట్లాడినా అది కేవలం నాటకమని హత్య ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఇటీవల అమృతకు ఫోన్ చేసిన మారుతీరావు వినాయక చవితి పండుగకు ఇంటికి రావాలని ఆహ్వానించగా, ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక తనకు ప్రాణహాని ఉందని ముందే గుర్తించిన ప్రణయ్ తన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రణయ్ ఇంటి సీసీ ఫుటేజీ పరిశీలించగా ఆగస్టు 22న నిందితుడు ప్రణయ్ ఇంటివద్ద రెక్కీ నిర్వహించినట్లు తేలింది.

స్వచ్చందంగా మిర్యాలగూడ బంద్

ప్రణయ్ హత్యతో మిర్యాలగూడలో ఉదృక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి యువకులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ప్రణయ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ప్రణయ్ హత్యకు నిరసనగా దళిత సంఘాలు ఇవాళ మిర్యాలగూడ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో పట్టణంలోని దుకాణాలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నాయి. అయితే, ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించాలని దళిత సంఘాలు భావిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మారుతీరావు ఇంటివద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మారుతీరావు, శ్రవణ్ ల ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

Similar News