ఎంసెట్ పేప‌ర్ లీకేజీ వెన‌క‌ న‌మ్మ‌లేని నిజాలు

Update: 2018-07-06 12:30 GMT

2016 సంవత్సరం లో జరిగిన ఎంసెట్ పేపర్-2 లీకేజ్ కేసు మరో సారి తెరపైకి వచ్చింది...చాలా కాలం తర్వాత సీఐడీ మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారు కార్పొరేట్ కళాశాలల సిబ్బంది కావ‌డం, వీరిద్దరికి గతంలో అరెస్ట్ అయిన కీలక నిందితులతో సంబంధాలు ఉన్నాయని సిఐడి గుర్తించింది. కాల్ లిస్ట్ ఆధారంగా తీగ లాగడం తో డొంక కదిలింది.

కార్పొరేట్ క‌ళాశాల‌ల డొంక‌...

తెలంగాణ ఎంసెట్ లీకేజ్ కేసుల్లో సీఐడీ పురోగతి సాధించింది.. మొదట్లో ఈ కేసుల్లో దూకుడు పెంచి వరుస అరెస్టులు చేసిన సీఐడీ తర్వాత కేసు దర్యాప్తులో దూకుడు తగ్గించింది. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ శ్రీచైతన్య కళాశాల డీన్ వాసుబాబుతో పాటు నారాయణ, శ్రీచైత‌న్య కాలేజీల‌కు విజయవాడ ఏజెంట్ వెంక‌ట‌శివనారాయణలను సీఐడీ అరెస్ట్ చేసింది. భువనేశ్వర్ కు చెందిన కీలక నిందితులు ధనుంజాయ్ ఠాకూర్,సందీప్ కుమార్ లతో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థుల నుండి ఒక్కొక్కరి చొప్పున 36 లక్షలు వసూలు చేసి క్యాంపున‌కు తరలించారని సీఐడీ ప్రధాన ఆరోపణ.

ఆరుగురి విద్యార్థుల‌కు అలాగే ర్యాంకులు...

కార్పొరేట్ కాలేజీల ధనదాహం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పోటీ ప్రపంచంలో తమ పేరు ప్రతిష్టల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ఎంసెట్ పేపర్ 2 లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల హస్తం వెలుగుచూసింది. తమ కాలేజీ విద్యార్థికే టాప్ ర్యాంక్స్ వచ్చాయని చెప్పుకోవడానికి అడ్డగోలు వ్యవహారానికి తెరదీసిన వ్యవహారం సీఐడీ విచారణలో వెలుగు చూడడం సంచలనం రేపుతోంది. అరెస్ట్ అయిన ఇద్దరూ ప్రధాన నిందితుడితో సంబంధాలు కలిగి ఉన్నట్టు వాళ్ల కాల్ డేటా ఆధారంగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాతే అరెస్ట్ చేసింది సీఐడీ. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేలింది. అలా వసూలు చేసిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి టాప్ ర్యాంక్స్ వచ్చినట్లు విచారణలో తేలింది. మరో ముగ్గురికి కూడా మంచి ర్యాంకులు దక్కాయి. ఆరుగురు విద్యార్థులకు ముందే పేపర్ అందడం వల్లే వారికి మంచి ర్యాంకులు వచ్చాయని వెల్లడైంది.

కార్పొరేట్ క‌ళాశాల‌ల కక్కుర్తే కార‌ణం

వాసుబాబును హైదరాబాద్ లో, వెంకట శివనారాయణను గుంటూరులో అరెస్ట్ చేశారు. లీకేజీ నిందితులతో వీరిద్దరూ టచ్ లో ఉన్నట్టు వీళ్ల కాల్ రికార్డులో కూడా ధృవీకరించాయి. ఒడిషా రాజధాని భువనేశ్వర్ కేంద్రంగా ఈ లీకేజ్ క్యాంప్ విద్యార్థులతో నిర్వహించినట్టు సీఐడీ విచారణలో తేలింది. పేరు పెద్ద ఊరు దిబ్బ‌ అన్న చెందంగా తయారు అయింది కార్పొరేట్ కళాశాలల వ్యవహారం.. ఆదాయమే ధ్యేయంగా ర్యాంకుల వేటలో పడి విద్యార్థుల భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను బుగ్గిపాలు చేశాయి.

Similar News