దేవెగౌడ ఫిట్ నెస్ చూస్తే అవాక్కవ్వాల్సిందే...!

Update: 2018-06-15 06:49 GMT

ఇటీవల దేశవ్యాప్తంగా ఫిట్ నెస్ సవాల్ కు విపరీతమైన ప్రాచుర్యం లభించింది. ప్రధాని మోడీ కూడా ఇందులో పాల్గొని తాను ఆసనాలు చేసే వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామికి ఈ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే గుండె సంబంధ ఆపరేషన్ చేసుకున్న కుమారస్వామి కఠినమైన వ్యాయామాలను చేసే అవకాశం లేదు. దీంతో ఆయన ఈ సవాల్ ను సున్నితంగా తిరస్కరించారు. అయితే, ఇది జేడీఎస్ కార్యకర్తలకు మాత్రం మింగుడు పడలేదు. అసలు, ఈ సవాల్ ని మోడీ కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడకు విసిరి ఉంటే అదిరిపోయే జవాబు చెప్పేవారని ఆ పార్టీని నేతలు చెబుతున్నారు. అన్నట్లుగానే ఇప్పుడు దేవెగౌడ ఫిట్ నెస్ ఫొటోలో బయటకు వచ్చాయి. అసాధారణ రీతిలో 86 ఏళ్ల దేవెగౌడ తన ఇంట్లోని జిమ్ లో చేసే కఠినమైన ఎక్సర్ సైజ్ లు చూస్తే 40 ఏళ్ల వయస్సున్న వారు సిగ్గుపడతారు. సాకులు చెప్పి వ్యాయామాన్ని తప్పించుకునే వారు కొంతైనా మారుతారు.

ఎలా సాధ్యమవుతోంది..?

బెంగళూరులోని నివాసంలో ఉన్న ప్రత్యేకమైన జిమ్ లో దేవెగౌడ ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. అవి కూడా కఠినమైనవి. ఇందుకోసం కార్తీక్ అనే ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ను ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా పనిచేసిన ఆయన గత ఐదు దశాబ్ధాలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నా ఆయన క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు. ప్రతీరోజు గంట పాటు ట్రెడ్ మిల్, వైట్ లిఫ్టింగ్, డంబుల్స్ తదితర పరికరాలతో కఠిన వ్యాయామం చేస్తారు. దీంతో ఆయన 86 ఏళ్ల వయస్సులోనూ ఆరోగ్యంగా ఉన్నారు. గత ఫిబ్రవరీలో ఆయన కర్ణాటకలోని శ్రావణబెళగోళ వద్ద జరిగే గోమటేశ్వరిని(బాహుబలి) మహామస్తకాభిషేకం మహోత్సవానికి హాజరయ్యేందుకు ఆయన 40 డిగ్రీల ఎండలో 1300 మెట్లు ఎక్కడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ ఆయన ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి జేడీఎస్ తరుపున ప్రచారం చేశారు. తాను తక్కువ తింటానని, మధ్యపానం, ధూమపానం అలవాటు లేదని, కేవలం శాఖాహారమే తింటానని దేవెగౌడ అంటున్నారు. తక్కువ పడుకుంటానని, వేకువజామునే నిద్ర లేస్తానన్నారు. మితాహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించడం వల్లే తాను ఈ వయస్సులో కూడా వ్యాయామం చేయగలుగుతున్నారని తెలిపారు.

Similar News