రాజీనామాకు రీజన్ లు చెప్పిన దానం

Update: 2018-06-23 07:16 GMT

30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి, పార్టీ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని, కానీ తెలంగాణలో పార్టీ బీసీలను చిన్నచూపు చేస్తోందనే ఆవేదనతో కాంగ్రెస్ కు రాజీనామా చేశానని మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...గ్రేటర్ ఎన్నికల సమయంలో తనకు తెలియకుండానే టిక్కెట్లను ఇచ్చారని, అయినా పార్టీ సైనికుడిగా వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన డీ.శ్రీనివాస్, కేశవరావు వంటి వారు పార్టీ మారడానికి కారణాలను రాహుల్ కి చెప్పానని, కానీ నేను చెప్పిన వాటికి ఒక కులానికి చెందిన నాయకులు వ్యతిరేకంగా చెప్పారని ఆరోపించారు. సమగ్ర సర్వేలో 256 బీసీ కులాలు ఉన్నాయని, 1 కోటి 67 లక్షల మంది బీసీ వర్గాల ప్రజలు ఉన్నారని, జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ బీసీలే ఉన్నారన్నారు. ఇంత పెద్ద జనాభా ఉన్న బీసీలను చిన్నచూపు చూడటం కాంగ్రెస్ కు తగదన్నారు.

బస్సుయాత్రలోనూ.....

బస్సుయాత్రలో ఒకే వర్గం వారు 10 మంది మాట్లాడితే, బీసీలు ఒక్కరు మాట్లాడటమే కష్టంగా ఉందని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కోసం కష్టపడుతుంటే ఆయనను ఎదగనీయకుండా చేస్తున్నారన్నారు. దేశంలోని అన్ని పార్టీలకు వెళ్లి వచ్చిన వారు కాంగ్రెస్ లో మంత్రులయ్యారని, జెండా మోసిన కార్యకర్తలకు గుర్తింపు లేదనే మనోవేదన ఉందన్నారు. కార్యకర్తల ఆవేదనని పార్టీ దృష్టికి తీసుకెళ్లినా ఎప్పుడూ పట్టించుకోలేదని, ఆత్మగౌరవం లేని చోట ఉండలేకనే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. గులాం నబీ ఆజాద్ తనకు ఎంతగానో సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇప్పుడు కాంగ్రెస్ లో పదవి రెడీగా ఉందని, అది వదులుకోని రాజీనామా చేశానన్నారు. టీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతాననేది త్వరలోనే చెబుతానని స్పష్టం చేశారు.

వైఎస్ఆర్, కేసీఆర్ పై ప్రశంసలు

కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిలా ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడని, ఆయనలా పార్టీకి రక్షణ కవచంలా ఉండేవారు ఇప్పుడు లేరని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డ కష్టపడుతున్నారు, ఆయనకు వ్యతిరేకంగా తెల్లారే ఢిల్లీకి వెళుతున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో ఏమి జరుగుతుందో కూడా ఉత్తమ్ కు తెలియని పరిస్థితి ఉందన్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. భారతదేశ చరిత్రలో రాజశేఖరరెడ్డి తర్వాత బడుగు, బలహీన వర్గాల వారి బాగుకోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని కితాబిచ్చారు. పేదల కోసం 108, 104, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టిన రాజశేఖర్ రెడ్డి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. కేసీఆర్ సైతం బడుగు బలహీన వర్గాలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్నారుని, వారి బాగు కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ లో ఎటువంటి హామీ తీసుకోకుండా చేరుతున్నానని, ఏ స్థానంలో ఉన్నా కష్టపడి పనిచేస్తానని స్పష్టం చేశారు.

Similar News