కామెడీ...కామెడీగా ఉందే....!

Update: 2018-10-04 11:14 GMT

గత ఎన్నికల ముందు తెలంగాణ బిల్లు పాసయ్యాక కాంగ్రెస్ ఎంపీలు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. దిగగానే బయటకు వచ్చి నేతలంతా ఉన్నఫళంగా కిందపడి నేలను ముద్దాడారు. అంటే తమ మాతృభూమి, స్వరాష్ట్రానికి మొదటిసారి వచ్చామనే పట్టరాని సంతోషంతో ఇంద్రా సినిమాలో చిరంజీవిలా ఈ పనిచేశారు. అయితే, చిరంజీవి ఒక్కరే సినిమాలో చేయడంతో ఈలలు పడ్డాయి. కానీ ఎయిర్ పోర్టు సీన్ లో మాత్రం 10 మందికి పైగా నేతలు స్థలం కూడా లేకున్నా ఇరుకుగా అందరూ నేలను ముద్దాడి కామెడీ సినిమాను తలపించారు. ఇది అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ప్రింట్ కావడంతో సామాన్య ప్రజలకు కూడా నేతలది ‘అతి’ అనిపించింది. అదే సమయంలో కేసీఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు రాగానే వేలాది మంది కార్యకర్తలు యుద్ధంలో గెలిచిన వీరుడిలా స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి కేసీఆర్ తెలంగాణ ను తీసుకువచ్చిన ఛాంపియన్ లా ప్రజలకు కనిపించారు. కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ ముందు తేలిపోయారు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం వారి వంతు పోరాటం చేశారనేది మాత్రం వాస్తవం.

ఖడ్గం పట్టుకుని విన్యాసాలు...

ఇక, ఈ ఎన్నికల విషయానికి వస్తే గత సీన్లు రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది కాంగ్రెస్ పెద్దల వాలకం చూస్తుంటే. ఓవైపు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి వరుస సభలతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ నేతలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇదే సమయంలో ఇవాళ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం ప్రారంభించారు. మొదట జోగులాంబ ఆలయంలో పూజలు నిర్వహించి రోడ్ షో, సభలో పాల్గొన్నారు. ఇక ఏ సభల్లో నాయకులకు కార్యకర్తలకు ఖడ్గాలు బహుకరించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఆ ఖడ్గాన్ని ఓసారి పట్టుకుని పోజిచ్చి ఎవరైనా వదిలేస్తారు. కానీ, కాంగ్రెస్ నాయకులు అలాకాకుండా ఖడ్గాన్ని పట్టుకుని ఏకంగా విన్యాసాలే చేశారు. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నుంచి పీసీసీ ఇంఛార్జిగా ఉన్న ఆర్.సి.కుంతియా వరకు వరుసగా ఖడ్గాన్ని పట్టుకోవడం.. విన్యాసం చేసి చూపడమనే తంతు జరిగింది. ఇక ఈ విజువల్స్ ను పలు ఛానళ్లలో పదేపదే చూపిస్తుండటంతో చూసేవారు నవ్వుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామనే కాంగ్రెస్ కార్యకర్తలు కోటి ఆశలతో ఉంటే నేతల ప్రవర్తనేమో ఈ విధంగా ఉంది. ఇక సభలో నాయకుల ప్రసంగాలు సైతం ఏమంతా ఆకట్టుకోలేకపోయాయి. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రచారం కూడా తేలిపోయింది.

Similar News