రాజకీయం అంటే సినిమా కాదుగా?

సినీ తారలు రాజకీయాల్లోకి వస్తారే తప్పంచి ఎక్కువ కాలం నిలదొక్కుకోలేరు. అందుకు అనేక కారణాలున్నాయి. అప్పటి వరకూ ఏసీ రూముల్లో ఉన్న వారు ప్రజల వద్దకు వచ్చి [more]

Update: 2020-08-08 18:29 GMT

సినీ తారలు రాజకీయాల్లోకి వస్తారే తప్పంచి ఎక్కువ కాలం నిలదొక్కుకోలేరు. అందుకు అనేక కారణాలున్నాయి. అప్పటి వరకూ ఏసీ రూముల్లో ఉన్న వారు ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను వినేంత ఓపిక ఉండదు. అలాగే వారికి ఇన్ స్టెంట్ ఫలితాలు ఉండాలి. సినిమా విడుదలయిన వెంటనే ఫలితం వస్తుంది. రాజకీయాల్లో అలా కాదు. ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి పాలయినా ప్రజలకు అందుబాటులో ఉంటేనే తర్వాతైనా ఫలితం దక్కుతుంది. కానీ నేడు సినీ తారలు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఒక్క ఎన్నికతో ఇలాగే మాయమయిపోతున్నారు.

అధికారంలో ఉన్న….

ఇక సినీతారలు అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ఎక్కువగా వెళతారు. వారికి జనం పల్స్ పెద్దగా తెలియకపోవడంతో అధికార పార్టీయే వారికి కనిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో అనేక మంది సినీతారలు చేరారు. 2014 ఎన్నికల్లో బీజేపీ దేశంలో అధికారంలోకి రావడంతో సినీతారలు లెక్కకు మిక్కిలిగా చేరిపోయారు. వారంతా ఎన్నికలప్పుడే హడావిడి చేస్తారు. ఆ తర్వాత కన్పించరు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతుంది. అలనాటి సినీనటి కవిత టీడీపీని వదలి బీజేపీలో చేరారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు. కానీ హైదరాబాద్ లోనే కవిత ఎక్కువగా ఉండటంతో ఏపీకి వెళ్లడం సాధ్యపడటం లేదు.

ఎన్నికల తర్వాత…..

ఇక గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మరోసినీనటుడు బాబూ మోహన్ పార్టీలో ఎక్కడా కన్పించడం లేదు. ఆయన తెలుగుదేశం, టీఆర్ఎస్ లో పనిచేశారు. ఆంథోల్ నియోజకవర్గం నుంచి బాబు మోహన్ 2014లో గెలిచారు. ఆ తర్వాత టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి 2018 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. పార్టీ కార్యాలయం వైపు కూడా ఎప్పుడూ రారు. పార్టీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం జరిగిన తర్వాత కూడా ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చిన దాఖాలాలు లేవు.

కండువా కప్పుకోవడం వరకే….

ఇక మరో నటి రేష్మా రాధోడ్ బీజేపీలో చేరి వైరా నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గాలేరు. ఒక మరోనటి మాధవీలత బీజేపీలో చేరి ఏపీలోని గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే మాధవీలత గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. తెలంగాణలో యాక్టివ్ కావాలనుకుంటున్నారు. ఇలా సినిమాల నుంచి అంతో ఇంతో పేరు సంపాదించుకుని రాజకీయాల్లోకి వస్తున్న నటులు ఆ తర్వాత కన్పించకుండా పోతున్నారు. పార్టీలు కూడా వీరి పరిస్థితిని గమనించి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం మానేశాయి.

Tags:    

Similar News