పవన్ వెంట మెగా ఫ్యామిలీ లేదా ?

Update: 2018-12-28 05:00 GMT

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటినుంచి అది విలీనం అయ్యేవరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర అందరికి తెలిసిందే. యువరాజ్యం అధినేతగా పట్టాభిషేక్తుడై, నాడు యువతను పీఆర్పీ వైపు ఆకర్షించేలా అహరహం శ్రమించారు పవన్. తన శక్తిని, యుక్తిని ఎంతగానో అన్న పార్టీకి ధారపోసిన పవన్ కళ్యాణ్ తన ఆలోచనకు భిన్నంగా మెగాస్టార్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం పై మొదటి నుంచి అసంతృప్తిగానే ఉండేవారు. ఆయన పేరుకు యువరాజ్యం అధ్యక్షుడు అయినా పవన్ కి పీఆర్పీలో నిర్ణయాధికారంలో మెగాస్టార్ భాగం చేయకపోయినా ఆయన తన అసంతృప్తిని ఆక్రోశాన్ని బహిర్గతం చేయలేదు. అయితే విలీనం తరువాత రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ప్రజారాజ్యం చేసిన చారిత్రక తప్పును సరిదిద్దేందుకు నడుం కట్టారు పవన్. 2014 ఎన్నికల కు ముందు జనసేన ను ప్రకటించి సంచలనం సృష్ట్టించారు పికె. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపి, బిజెపిలకు మద్దతు ఇచ్చి కేంద్ర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు రావడంలో కీలక భూమిక పోషించింది జనసేన.

తొలినుంచి దూరంగానే చిరంజీవి ...

జనసేన ఏర్పడినప్పటినుంచి మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యసభ పదవి అడ్డుగా ఉండటంతో బాటు ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్న నేపథ్యంలో చిరంజీవి రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేకుండా దూరం జరిగి ఖైదీ నెంబర్ 150 పేరుతో సినిమాల్లో ఇచ్చారు చిరంజీవి. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాకా సైరా సినిమాలో బిజీ అయిపోయారు ఆయన. ఇలా రాజకీయాలకు నాకు సంబంధం లేదన్నట్లు వున్న చిరంజీవి ఆ తరువాత శ్రీ రెడ్డి వెర్సెస్ పవన్ ఎపిసోడ్ లో మాత్రం తమ్ముడికి అండగా కుటుంబం మొత్తం ఉండేలా చేసినా ఆ తరువాత మళ్ళీ దూరం జరిగారు.

పవన్ కి దగ్గరగా నాగబాబు ...

చిరంజీవి పవన్ కి దూరంగా ఉంటే తొలినుంచి నాగబాబు మాత్రం పవన్ కి పూర్తి సపోర్ట్ ప్రకటించారు. ఇటీవలే తన కుమారుడు వరుణ్ తేజ్ తో కలిసి నాగబాబు కోటి పాతికలక్షల రూపాయలు విరాళం ప్రకటించి తమ్ముడి రాజకీయ అభివృద్ధికి అన్ని విధాలా అందండలు అందించేందుకు సిద్ధమని చాటి చెప్పారు. అయితే ఇంతటి సపోర్ట్ మాత్రం చిరంజీవి నుంచి మాత్రం పవన్ కి రాజకీయంగా ఇప్పటివరకు లభించకపోవడం గమనార్హం.

చరణ్ ఫంక్షన్ లో చిరు ...

మెగాస్టార్ అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన వినయ విధేయ రామ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి తమ్ముడి రాజకీయ ప్రయాణం పై పెదవి విప్పలేదు. దాంతో మెగా అభిమానులు కొంత నిరాశ పడ్డారు. జనసేన బ్యానర్లతో కొందరు కార్యక్రమంలో మెగా కుటుంబం పై పవన్ కి మద్దతు కోసం వత్తిడి తెచ్చారు. దాంతో చిరంజీవి నుంచి రామ్ చరణ్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వరకు అంతా గోడమీద పిల్లిలా వ్యవహారం నడుపుకుంటూ వచ్చారు. జనసేన పార్టీ సింబల్ ను కూడా ప్రస్తావించకుండా రాంచరణ్ ఇప్పుడు అంతా టీ గ్లాస్ లో తాగడం ట్రెండ్ గా మార్చుకున్నారని వ్యాఖ్యానించి ఫ్యాన్స్ లో జోష్ పెంచారు. బాబాయి సినిమాలు సైతం వదులుకుని ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి తీవ్రంగా కష్టపడుతున్నారని పవన్ కృషి పై ప్రశంసలు కురిపించారు. ఇక కెటిఆర్ పవన్ అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో కూడా రాణించాలని కోరుకుంటున్నా అంటూ సరిపెట్టారు. చిరంజీవి అయితే పవన్ ప్రస్తావన తెచ్చినా అది జనసేన కోసం కాకపోవడం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

ముందుకు వచ్చేది లేదా ...?

ఈ కార్యక్రమం వీక్షించిన వారికి ఎవరికైనా జనసేన కు బాహాటంగా చిరంజీవి నిలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపించదు. ప్రజారాజ్యం చేదు అనుభవాలతో రాజకీయాలకు దూరంగా సినిమాలకు దగ్గరగానే ఉండాలనే ఆలోచన లోనే చిరంజీవి ఉన్నట్లు స్పష్టం అవుతుంది. అయితే తమ్ముడి పై తనకున్న ప్రేమ విషయంలో మాత్రం చిరంజీవి అమితమైన భావోద్వేగాన్ని మాత్రం కురిపించడం ఆసక్తికరం.

Similar News