జగన్ ను అంత మాటంటే....???

Update: 2018-12-25 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. తాజాగా ఆయన కొత్తగా లేవెనెత్తిన అంశం రాజకీయ అనుభవం. జగన్ కు రాజకీయ అనుభవం లేదట. కనీసం పంచాయతీ వార్డు మెంబరు కూడా చేసిన అనుభవం జగన్ కు లేదట. అలాంటి అనుభవం లేని జగన్ కు అధికారం అప్పగిస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు నాయుడు కొత్త భాష్యం చెప్పారు. ఎటువంటి అనుభవం లేని జగన్ అధికారంలోకి వస్తే ఏపీకి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లేనన్న ఆందోళన ఆయన మీడియా సమావేశంలో వ్యక్తం చేశారు.

లోకేష్ అనుభవాన్ని....

అయితే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో చంద్రబాబునాయుడిపై వైసీపీ అభిమానులతో పాటు నెటిజెన్లు కూడా ఫైరవుతున్నారు. అసలు అనుభవం అంటే ఏంటో చంద్రబాబు గారూ.. అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తన కుమారుడు నారా లోకేష్ వార్డు మెంబర్ గా గెలవలేదని, ప్రత్యక్ష్య రాజకీయాల్లో పోటీ చేయలేదని, అయినా ఆయనను మంత్రిని ఏ అనుభవం ఉందని చేశారని సూటిగా ప్రశ్నలు కొందరు సంధిస్తున్నారు. ఇప్పటికీ అవగాహన లేమితో మాట్లాడే లోకేష్ తో రాష్ట్రం భవిత బాగుంటుందా? అని చమత్కరిస్తున్నారు మరికొందరు.

ఫైరవుతున్న నెటిజెన్లు....

ఇటీవల జరిగిన పరిణామాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి టీడీపీలో చేరిన కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో మరణిస్తే ఎక్కడా సభ్యుడిని కాని ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ కు ఎలా మంత్రి పదవి ఇచ్చారంటున్నారు. జగన్ 2009 నుంచి 2014 వరకూ లోక్ సభ సభ్యుడిగా ఉన్న విషయం మర్చారా? అని నిలదీస్తున్నారు. 2014 నుంచి ప్రతిపక్ష నేత అన్న విషయం గుర్తుకు లేదా? అని అంటున్నారు. అసలు చంద్రబాబు రాజకీయ జీవితాన్నే మరికొందరు తెరపైకి తెస్తున్నారు. చంద్రబాబు తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్ల అనుభవానికే మంత్రి పదవి చేపట్టిన విషయాన్ని మరికొందరు పోస్టింగ్ లతో హోరెత్తిస్తున్నారు.

నవీన్ పట్నాయక్ ను గుర్తు చేస్తూ.....

అసలు రాజకీయ అనుభవం అంటే కొలమానం ఏంటో వివరణ ఇవ్వాలనికూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక పొరుగురాష్ట్రమైన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎలాంటి చట్ట సభల్లో సభ్యుడు కాకుండానే ముఖ్యమంత్రి అయిన విషయాన్ని కొందరు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. జగన్ గత ఏడాదికిపైగానే ప్రజల చెంతే ఉంటూ పాదయాత్రలో సమస్యలు తెలుసుకుంటుంటే... అనుభవం లేదన్న ప్రచారాన్ని చేసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. చంద్రబాబు ప్రస్తుత కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో కొందరు ఒకసారి గెలిచిన వారేన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద జగన్ అనుభవం...తన 40 ఇయర్స్ అనుభవం పోలికతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్లేటట్లు కనపడుతుందన్న కామెంట్స్ మాత్రం బాగానే విన్పిస్తున్నాయి.

Similar News