మైకులు మూగబోయాయి... టెన్షన్ మొదలైంది..!

Update: 2018-12-05 11:30 GMT

మూడు నెలలుగా తెలంగాణలో గ్రామగ్రామాన... వాడవాడనా హోరెత్తిన ప్రచారపర్వం ముగిసింది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5 గంటలతో తెరపడింది. నిరంతరం ఇరాం లేకుండా నడిచిన మైకులు మూగబోయాయి. చివరి ప్రయత్నంగా ఇవాళ అన్ని పార్టీలూ సభలు నిర్వహించి ప్రజలను తమవైపు మలుపుకునేందుకు ప్రయత్నించాయి. రాహుల్ గాంధీ కోదాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనగా... కేసీఆర్ తన స్వంత నియోజకవర్గం గజ్వేల్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫలాలు ప్రజలకు దక్కాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని రాహుల్ గాంధీ పిలుపునివ్వగా... ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతున్న తెలంగాణను ఆగం చేయవద్దని... దాచి దాచి దయ్యాలపాలు చేయవద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక బీజేపీ కూడా పలు జిల్లాలో చివరి రోజు సభలు నిర్వహించారు.

జాతీయ నేతలు రంగంలోకి దిగి...

సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేసి అదే రోజు 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికలకు శంఖారావం పూరించారు. అదే రోజు నుంచి టీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది. సుమారు మూడు నెలల పాటు టీఆర్ఎస్ ప్రచారం చేసింది. కేసీఆర్ సుడిగాలి పర్యటనల ద్వారా అన్ని నియోజకవర్గాలు తిరిగివచ్చారు. ఇక కాంగ్రెస్ కూడా ఎన్నడూ లేనంతగా తెలంగాణపై దృష్టి పెట్టి ప్రచారం నిర్వహించింది. రాహుల్ గాందీ ఏకంగా 10కి పైగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల నేతలు కూడా తెలంగాణ దిగిపోయి ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ కూడా తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ముఖ్యమంత్రులు యోగి ఆధిత్యనాధ్, శివరాజ్ సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించారు. అన్ని పార్టీలు, నేతలు ఎప్పుడూ లేనంతగా చెమటోడ్చి ప్రచారం చేశారు. ఇక ఏ పార్టీ కష్టం ఫలిస్తుందో తేలాలంటే 11వ తేదీ వరకు ఆగాల్సిందే.

Similar News