సంచలన విషయాలు చెప్పిన అవంతి శ్రీనివాసరావు

చంద్రబాబు హయాంలో అవినీతి, నిరంకుశత్వం, బంధుప్రీతి రాజ్యమేలుతోందని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. గురువార ఆయన టీడీపీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ [more]

Update: 2019-02-14 11:46 GMT

చంద్రబాబు హయాంలో అవినీతి, నిరంకుశత్వం, బంధుప్రీతి రాజ్యమేలుతోందని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. గురువార ఆయన టీడీపీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘ ఏడాదిన్నరగా పార్లమెంటు లోపల, పార్లమెంటు భయట ఆందోళన చేసినా కేంద్రం ఏమీ ఇవ్వలేదు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే మనమూ చేద్దామని, తెలంగాణ కోసం కేసీఆర్ అనేకసార్లు రాజీనామా చేసి సాధించారని చంద్రబాబుకు చెప్పాను. కానీ, నా మాట వినలేదు. ఇప్పుడు ధర్నాలు, ప్లకార్డులతో ఏమి సాధించాం? ఆనాడే 25కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే దేశం మొత్తం మనవైపు చూసేది. 2014లో కాంగ్రెస్ మోసం చేసిందని, ఆ పార్టీని ఓడించాలని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ మంచిదని చెబుతున్నారు. ఆయన ఏది చెబితే అది ప్రజలు నమ్ముతారని చంద్రబాబు అనుకుంటున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ కోసం నేను పోరాడితే చంద్రబాబు నా మీద కోప్పడ్డారు.’’ అని పేర్కొన్నారు.

ప్రధానిపై బాబు కోపానికి కారణమదే

‘‘జగన్ ముందు నుంచీ ఒకే స్టాండ్ మీద ఉన్నారు. చంద్రబాబు అవసరాన్ని బట్టి నిర్ణయాలు మార్చుకున్నారు. చంద్రబాబులా ఎన్నికల కోసం కాకుండా మొదటి నుంచీ జగన్ ఒకే మాట మీద ఉండటం నాకు నచ్చింది. ఓ ఎమ్మెల్యే అవినీతిపై ప్రధాని కార్యాలయానికి నేరుగా ఫిర్యాదు వెళ్లాక.. ప్రధాని నేరుగా అవినీతి గురించి ఆరా తీయడం చంద్రబాబుకు నచ్చలేదు. అప్పటినుంచే మోడీతో విభేదాలు వచ్చాయి. చంద్రబాబుకు నచ్చినట్లు చేస్తే అందరూ మంచోళ్లు.. ఆయనకు నచ్చకపోతే కుమ్మక్కు అయ్యారని, కుట్రలు చేస్తున్నారని అంటారు. ఇంకా ప్రజలకు పప్పుబెల్లాలు ఇస్తే ఓట్లు వేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. పాదయాత్రలో జగన్ ను ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. చంద్రబాబు ఎలా మభ్యపెట్టినా ప్రజలు జగన్ తో ఉంటారు. కులాల మధ్య చిచ్చుపెట్టి హింసించింది చంద్రబాబు నాయుడే. చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా వారు మంచివారు కాకుండా పోతారు. నేను ఇప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చి చెబుతున్నాను. పార్టీలో ఉన్నవారు ఇంకా చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

వారిద్దరికీ తేడా అది

రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పరిపాలనను ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబుకు ప్రజలు మంచి అవకాశాన్ని ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేయకుండా ఆయనతో పాటు కొందరే బాగుపడ్డారు. మోడీ నిరంకుశంగా ఉన్నారని చెబుతున్న చంద్రబాబు ఎలా ఉన్నారో ఆలోచించుకోవాలి. ఆయన మాటలు నమ్మి ప్రజలు, నేతలు విసిగిపోయారు. రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన జరుగుతోంది. ప్రజలందరూ ఆలోచించాలి. నేను గనుక చంద్రబాబుతో నా స్వలాభానికి ఏదైనా పని చేయించుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఆమంచి కృష్ణమోహన్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్.. త్వరలో చాలామంది టీడీపీ నుంచి వైసీపీలో చేరుతారు. వైసీపీ నుంచి చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు. జగన్ మాత్రం మమ్మల్ని రాజీనామా చేసి రావాలని చెప్పారు. చంద్రబాబుకు.. జగన్ కు తేడా అది’’ అని అన్నారు.

Tags:    

Similar News