అయ్యో ఆది… ఆగమైపోయావే..!

తాత్కాలిక అధికారం కోసం రాజకీయ భవిష్యత్ ను ముంచేసుకున్నారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఆయన అధికార పార్టీలోకి [more]

Update: 2019-06-01 15:30 GMT

తాత్కాలిక అధికారం కోసం రాజకీయ భవిష్యత్ ను ముంచేసుకున్నారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఆయన అధికార పార్టీలోకి చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. మూడేళ్ల పాటు కడప జిల్లాలో చక్రం తిప్పాలని చూశారు. కడప కోటను బద్దలు కొడతానని, పులివెందులలో జగన్ మెజారిటీని తగ్గించేస్తానని భారీ ప్రకటన ఇచ్చారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే ఆయనే చతికిలపడ్డారు. ఆయన ఫ్యూచర్ ఇప్పుడు డైలమాలో పడింది. కడప పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోవడం, స్వంత నియోజకవర్గం జమ్మలమడుగులోనూ పార్టీని గెలిపించుకోలేకపోవడంతో ఇప్పుడు ఆయన షాక్ లో ఉన్నారు.

మూడేళ్లు చక్రం తిప్పినా…

ముఖ్యమంత్రి జగన్ స్వంత జిల్లా అయిన కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య తీవ్ర ఫ్యాక్షన్ వైరం ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్యే జమ్మలమడుగు రాజకీయం నడుస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 12 వేల మెజారిటీతో విజయం సాధంచారు. కడప జిల్లాకు చెందిన వారు కావడం, జగన్ సామాజకవర్గం నేత కావడంతో ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకొని కడప జిల్లాలో జగన్ హవాకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ దారుణంగా వికటించింది. ఆదినారయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకొని ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. మూడేళ్ల పాటు ఆయన జిల్లాలో కీలక పాత్ర పోషించారు. ఏకంగా వైసీపీని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు. దీంతో ఆదినారాయణరెడ్డి హవా మరింత పెరిగింది. సమయం దొరికినప్పుడల్లా జగన్ పై ఒంటికాలితో లేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించేవారు.

డేంజర్ లో ఆది ఫ్యూచర్

కడప జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుస్తామని, పులివెందులలో జగన్ మెజారిటీని తగ్గిస్తామని పదే పదే సవాళ్లు విసిరారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి తమ మీదనే విమర్శలు చేయడం, సవాళ్లు విసురుతుండటాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. ఇక, ప్రత్యర్థులుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిని ఒకే పార్టీలోకి తీసుకువచ్చి ప్రయోగం చేసిన చంద్రబాబు వీరి మధ్య సయోధ్య కోసం తీవ్రంగా శ్రమించారు. ఆదికి మంత్రి పదవి ఇవ్వగానే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక, జమ్మలమడుగు టిక్కెట్ ను రామసుబ్బారెడ్డికి ఇచ్చి కడప పార్లమెంటు టిక్కెట్ ను ఆదినారాయణరెడ్డికి బలవంతంగా కట్టబెట్టారు. అయిష్టంగానే బరిలోకి దిగిన ఆదినారాయణరెడ్డి గెలవడం సంగతి అటుంచితే ఫ్యాన్ పార్టీ హవా ముందు తేలిపోయారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి గతంలో కంటే రెట్టింపు మెజారిటీ వచ్చింది. ఏకంగా మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో ఆయన ఆదినారాయణరెడ్డిని ఓడించారు. ఇక, ఆది స్వంత నియోజకవర్గం జమ్మలమడుగులోనూ టీడీపీ దారుణంగా ఓడిపోయింది. ఏకంగా 50 వేల మెజారిటీతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆదినారాయణరెడ్డి కలలు కల్లలయ్యాయి. మూడేళ్ల అధికారం కోసం టీడీపీలోకి వెళ్లిన ఆయన ఫ్యూచర్ ఇప్పుడు డేంజర్ లో పడింది.

Tags:    

Similar News