31 ఫైనల్‌ : ఇక కొత్త వినతులు కుదర్దంతే!

Update: 2016-10-06 01:17 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో కొత్త జిల్లాలకు తుదిరూపు ఇచ్చేశారు. రెండు మూడు రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాదాపుగా.. కేవలం ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అనే కసరత్తు మీదనే కాలం గడిపేస్తున్న సంగతి తెలిసిందే. దసరా నాడు ప్రారంభం కాబోతున్న ఈ జిల్లాల సంఖ్యకు, ఆకృతికి బుధవారం సాయంత్రానికి తుదిరూపు లభించింది. మొత్తం 31 జిల్లాలను ఫైనలైజ్‌ చేశారు. ఇక కొత్తగా వెల్లువెత్తుతున్న నిరసనలు డిమాండ్లు, కోరికలు వినతులు వేటినీ పట్టించుకునేది లేదని కూడా తేల్చేశారు.

తొలుత 27 జిల్లాలతో కొత్త తెలంగాణ స్వరూపాన్ని కేసీఆర్‌ ప్లాన్‌ చేశారు. కానీ.. జిల్లాల సంఖ్య పరంగా .. అనేక విజ్ఞప్తులు, ప్రజాందోళనలు జరిగాయి. చివరినిర్ణయాలు అయ్యే సమయానికి వాటన్నింటినీ కూడా ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. సీరియస్‌ శ్రద్ధతో డిమాండ్‌ చేసిన అందరి విజ్ఞప్తులను ఓకేచేశారు. ఆమేరకు తొలుత అనుకున్న 27కు అదనంగా, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జనగామ, గద్వాల జిల్లాలు ఓకే అయ్యాయి.

ఇంకేమైనా వినతులు అభ్యంతరాలు ఉండేట్లయితే పరిశీలించాల్సిందిగా కేకే నేతృత్వంలో హైపవర్‌ కమిటీ వేశారు. వారు బుధవారం రోజు పొడవునా అనేక ప్రాంతాలకు చెందిన అనేకమంది నేతల విజ్ఞప్తులు విన్నారు. కానీ.. సాయంత్రానికి కొత్త వినతులు ఇక పట్టించుకునేది లేదంటూ 31జిల్లాలను కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు.

ఆ మేరకు కొత్త జిల్లాలను ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రారంభించబోయేది కూడా ఆయన ఫైనలైజ్‌ చేసి ప్రకటించేశారు. ముఖ్యమంత్రి స్వయంగా రెండు జిల్లాలను ప్రారంభించబోతున్నారు. మెదక్‌, సిద్ధిపేట జిల్లాలను ఆయనే ప్రారంభిస్తారు. ఇక భూపాలపల్లి- స్పీకర్‌ మధుసూదనాచారి, జనగామ- మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, జగిత్యాల - మహమూద్‌ ఆలీ, వరంగల్‌ రూరల్‌- కడియం శ్రీహరి, సిరిసిల్ల - కేటీఆర్‌, మల్కాజ్‌గిరి- సీఎస్‌ రాజీవ్‌ శర్మ, యాదాద్రి- హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి, పెద్దపల్లి- ఈటల రాజేందర్‌, మంచిర్యాల- పద్మారావు, కామారెడ్డి- పోచారం శ్రీనివాసరెడ్డి, ఆసిఫాబాద్‌- జోగురామన్న, వికారాబాద్‌- మహేందర్‌ రెడ్డి, సూర్యాపేట- జగదీశ్‌రెడ్డి, వనపర్తి- జూపల్లి కృష్ణారావు, కొత్తగూడెం- తుమ్మల నాగేశ్వరరావు, నిర్మల్‌- ఇంద్రకరణ్‌రెడ్డి, గద్వాల - తలసాని శ్రీనివాసయాదవ్‌, నాగర్‌ కర్నూల్‌- లక్ష్మారెడ్డి, మహబూబాబాద్‌- చందూలాల్‌ లు కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ, తెరాస నుంచి కూడా చాలా మంది నేతలు చివరి నిమిషంలో తమ ప్రాంతం కూడా జిల్లా కావాలంటూ.. హడావుడి డిమాండ్లతో హైపవర్‌ కమిటీ మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నించారు కానీ, కేసీఆర్‌ వాటిని తోసిపుచ్చారు.

Similar News