చూసుకుందాం….రా

అగ్రనాయకులు హద్దులు దాటుతున్నారు. పార్టీశ్రేణులకు , యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సిన నేతలే వ్యక్తిగత ఆరోపణలతో వక్రమార్గం చూపిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత [more]

Update: 2019-11-13 15:30 GMT

అగ్రనాయకులు హద్దులు దాటుతున్నారు. పార్టీశ్రేణులకు , యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సిన నేతలే వ్యక్తిగత ఆరోపణలతో వక్రమార్గం చూపిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శ, జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన ప్రతివిమర్శ ఇప్పుడు రాష్ట్రరాజకీయాలను కుదిపేస్తున్నాయి. తెలుగుదేశం, వైసీపీల మధ్య గతం నుంచీ తీవ్ర విమర్శలు , పరస్పర దూషణలు సహజంగానే ఉంటూ వస్తున్నాయి. అయితే జనసేన, వైసీపీల మధ్య ‘చూసుకుందాం..రా’ అనే స్థాయి సవాళ్లు పెద్దగా లేవు. తొలిసారిగా ఇరువురు నేతలూ సూటిగా , అంశాల వారీగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో బరిలోకి దిగడంతో ఇరుపార్టీల క్యాడర్లో వేడి పుడుతోంది. ముఖ్యంగా బెజవాడ వీధుల్లో గొడవ పెట్టుకుందామంటే నేను సిద్ధమంటూ పవన్ చేసిన సినిమాటిక్ స్టేట్ మెంట్ కలకలం పుట్టిస్తోంది. నేరుగా ముఖ్యమంత్రిని, వైసీపీ శాసనసభ్యులను ఉద్దేశిస్తూ పవన్ చేసిన గరంగరం విమర్శలూ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.

మూడు పెళ్లిళ్ల ముచ్చట…

ఎన్నికల తరుణంలో వైసీపీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ నుద్దేశించి మూడు పెళ్లిళ్లంటూ విమర్శ చేశారు. రాజకీయంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని నాయకులు చూస్తుంటారు. ఎన్నికల వంటి సమయంలో వ్యక్తిగత దూషణలు సహజమే. అయితే తాజాగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ పై చేసిన ముగ్గురు భార్యల విమర్శ స్థాయికి తగినది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు భాష పరిరక్షణపై పవన్ చేసిన ప్రకటనకు స్పందనగా సబ్జెక్టుతో ఏమాత్రం సంబంధం లేని విధంగా భార్యల ప్రస్తావన తెచ్చారు సీఎం. దీనిపై పవన్ సైతం అదే స్థాయిలో స్పందించడం గమనార్హం. జగన్ పై సీబీఐ కేసు , విచారణలో భాగంగా జైలులో గడిపిన అంశాలను ముందుకు తెచ్చారు. ఉన్నతస్థానంలో రెండు పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నవీరిరువురూ తెలుగు భాషకు సంబంధించి స్పందించాల్సిన తరుణంలో వ్యక్తిగత దూషణలతో విషయాన్ని పక్కదారి పట్టించారనే చెప్పాలి. పైపెచ్చు రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతకు దారి తీసే విధంగా నాయకులు వ్యాఖ్యలు చేసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వారి స్థాయికి తగినది కూడా కాదు.

టెన్ థౌజండ్ వాలా…

అధినేతను చూసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు తనపై విరుచుకుపడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయమవుతున్నాయి. టెన్ థౌజండ్ వాలా బాంబును చుట్టుకున్నట్లున్న జగన్ పరిస్థితి అటు ఇటు అయితే ఆయనతోపాటు అందరూ గాయపడాల్సి వస్తుందంటూ వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు పవర్ స్టార్. ముఖ్యంగా రాష్ట్రంలో కులమనేది ఒక కీలకమైన సామాజిక అంశంగా కొనసాగుతూ వస్తోంది. తనపై విమర్శలకు కాపు నాయకులనే పురిగొల్పడాన్ని పవన్ తప్పుపట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినప్పటికీ వైసీపీకి అక్కడి ప్రజలు పట్టం గట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పేరును సంబోధించినప్పుడల్లా కులం పేరుతో కలిపి పలకడానికే పవన్ ప్రాధాన్యత నివ్వడం విశేషం. తర్వాత జనసేనానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున మాట్టాడిన మంత్రి పేర్నినాని సైతం పవన్ నాయుడు అంటూ ప్రత్యేకించి సంబోధించడం రాష్ట్రంలో కులాల వివాదాన్ని పెంచిపోషించేదే. ముఖ్యంగా రాజకీయ ఆధిపత్యంలో కులపరమైన విభజనకు ఈ ఘట్టం అద్దం పడుతోంది. దీనివల్ల ఏం సాధించదలచుకున్నారనేది జనసేనాని, వైసీపీలు రెండూ ఆలోచించుకోవాలి.

బెజవాడ వీధుల్లో …

ముఖ్యమంత్రి హుందాగా మాట్టాడటం లేదంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సైతం వివాదానికి ఊపిరి పోస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్టాడకుండా వైసీపీ నాయకునిగా విమర్శలు చేస్తున్నారని పవన్ తీవ్రంగానే ఆక్షేపించారు. ఇదే తీరు కొనసాగితే బెజవాడ వీధుల్లో గొడవలు పెట్టుకోవడానికీ తాను రెడీ అంటూ ప్రకటన చేయడంలోని ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకరకంగా రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా ప్రాంతాల అంతరాన్ని అంతర్గతంగా వెలికి తీయడమే దీని ఉద్దేశంగా చెప్పుకోవాలి. ఒకవైపు కులపరమైన ప్రస్తావన, మరోవైపు బెజవాడను ముందుకు తేవడం ద్వారా ముఖ్యమంత్రి రాయలసీమ కు చెందిన వాడనే అన్యాపదేశ ప్రస్తావన ఉందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. మొత్తమ్మీద ఎటు చూసినా వ్యక్తిగత దూషణలే కాకుండా కుల, ప్రాంత చిచ్చుకు సైతం అగ్రనాయకులు ఆజ్యం పోయడం విచారకరం. అటు ముఖ్యమంత్రి జగన్, ఇటు జన సేనాని పవన్ తమ స్థాయి నాయకులు సంయమనంతో మాట్టాడకపోతే పర్యవసానాలు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతాయన్న విషయాన్ని గ్రహించడం ఎంతైనా అవసరం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News