మూడు ముక్కలాట సాధ్యమా…?

ప్రత్యర్థి పార్టీలు ఛిన్నాభిన్నంగా ఉంటే అధికారపార్టీకి హాయి. ముక్కలు చెక్కలుగా ఓట్లను పంచుకుంటే అధికారపార్టీ నడక నల్లేరుపై బండిలా సాగిపోతుంది. తెలంగాణ రాష్ట్రసమితి ప్రభుత్వంపై క్రమేపీ అసంతృప్తి [more]

Update: 2021-05-07 09:30 GMT

ప్రత్యర్థి పార్టీలు ఛిన్నాభిన్నంగా ఉంటే అధికారపార్టీకి హాయి. ముక్కలు చెక్కలుగా ఓట్లను పంచుకుంటే అధికారపార్టీ నడక నల్లేరుపై బండిలా సాగిపోతుంది. తెలంగాణ రాష్ట్రసమితి ప్రభుత్వంపై క్రమేపీ అసంతృప్తి పెరుగుతోంది. కానీ దానిని తమకు అనుకూలంగా మలచుకోగల బలమైన పార్టీ ఒక్కటీ లేదు. నలభై శాతం లోపు ఓటు బ్యాంకుతోనే అధికారం దక్కించుకుంటున్న టీఆర్ఎస్ ను సవాల్ చేసే సత్తా రాష్ట్రంలోని పార్టీలకు ఇంకా సమకూరనే లేదు. తాజాగా ఈటల రాజేందర్ ప్రాంతీయ పార్టీ పెడతారంటూ ప్రచారం మొదలైంది. నిజంగా అదే జరిగితే కనీసం నాలుగైదు శాతం ప్రతిపక్ష సంఘటిత ఓట్లు చీల్చగలిగినా అధికార పార్టీకి ఆనందమే. అదే అధికారపార్టీ ఓట్లకు చిల్లు పెడితే మాత్రం ఇబ్బందికరమే. అయినా ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం టీఆర్ఎస్ కు సమీప ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెసులకు మధ్య 20శాతం పైగా ఓట్ల తేడా కొనసాగుతోంది. అందువల్లనే అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉన్నాయన్న భావనలోనే లేరు కేసీఆర్. తన ఏకపక్ష నిర్ణయాలను ఎదిరించేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అందువల్లనే కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం మేధోవర్గాల్లో , ఉద్యమ నాయకుల్లో వినవస్తోంది.

పేరుకే పెద్ద పార్టీలు…

కాంగ్రెసు, బీజేపీలు పేరుకే పెద్ద పార్టీలుగా చెప్పుకోవాలి. తెలంగాణకు సంబంధించి రెంటికీ బలహీనతలున్నాయి. కాంగ్రెసుకు రాష్ట్రవ్యాప్త నెట్ వర్క్ ఉంది. నాయకులు, కార్యకర్తలకు కొరత లేదు. కానీ ప్రజల్లోనే రోజురోజుకీ పలుకుబడి తగ్గిపోతోంది. నాగార్జున సాగర్ లో పెద్ద నాయకుడైన జానారెడ్డిని నిలబెట్టి సవాల్ చేసింది. కొత్తగా రాజకీయంలోకి వచ్చిన యువకుడి చేతిలో పార్టీ దారుణంగా దెబ్బతింది. ఇది రాజకీయంగా కాంగ్రెసు పరిస్థితిని చాటి చెబుతోంది. రాష్ట్రంలో కాంగ్రెసు పూర్తిగా కోలుకుని అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించడం కలలో మాటని టీఆర్ఎస్ దీమాగా ఉంది. టీపీసీసీని ముందుకు తీసుకెళ్లేందుకు బలమైన నాయకుడు ఒక్కరు కూడా కనిపించకపోవడం విచిత్రం. రాష్ట్రంలో బీజేపీ తిట్ల పార్టీగా మారిపోయింది. శాసనసభ వారీగా చూస్తే రాష్ట్రంలో ఒక నలభై రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల పార్టీ ఉనికే నామమాత్రం. టీఆర్ఎస్ తో పోలిస్తే మూడోవంతు పార్టీగా కమలాన్ని చూడాలి. అందుకే కాంగ్రెసు, బీజేపీలను అసలు ప్రత్యర్థులుగానే టీఆర్ఎస్ భావించడం లేదు. స్థానికంగా ఉన్న పరిస్థితుల వల్ల అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించడమే మినహా స్థిరమైన ఓటు బ్యాంకుతో సత్తా చాటలేకపోతున్నాయి ప్రతిపక్షాలు.

కోదండం నేర్పిన పాఠం…

జాతీయ పార్టీలు బలహీనంగా ఉండి, అధికారంలో ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు కొత్త పార్టీ కి చాయిస్ ఉంటుంది. అదే ఆలోచనతో కోదండ రాం తెలంగాణ జనసమితిని స్తాపించారు. కానీ ఆలస్యం అమృతం విషం అన్నట్లు టీఆర్ఎస్ బాగా బలపడిన తర్వాత తాపీగా పార్టీని ప్రారంభించి కోదండరామ్ దెబ్బతిన్నారు. అదే రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా తొలి ఎన్నికలోనే టీఆర్ఎస్ తో సంబంధం లేకుండా పార్టీని పెట్టి ఉంటే ప్రభావం చూపగలిగేవారు. లేకపోతే కాంగ్రెసుతో కలిసినా అధికారం వచ్చి ఉండే చాన్నులు ఎక్కువ. కానీ తన ప్రాబల్యం కోల్పోయాక ఉద్యమ సారథిని అంటూ ముందుకు రావడం వల్ల కోదండ రామ్ కు ఒట్టి చేతులే మిగిలాయి. కనీసం ఎమ్మెల్సీగా కూడా ప్రజలు గెలిపించలేదు. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఉద్యమం పేరు చెబుతూ ఆత్మాభిమానం నినాదంతో ఈటల రాజేందర్ చేతులు కాల్చుకుంటారా? అన్నది వేచి చూడాలి. తెలంగాణ జేఏసీకి ఛైర్మన్ గా నాయకత్వం వహించిన కోదండరామ్ వంటి వాళ్లనే ప్రజలు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ను ఎదిరించేంతటి బలం సమకూర్చుకోవడం ఈ మాజీ మంత్రికి సాధ్యమవుతుందా? అన్నది సమాధానం వెదకాల్సిన ప్రశ్న.

అంతా కలవకుండా అసాధ్యం…

ఇంతవరకూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని ఎన్నికలనూ పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేస్తే టీఆర్ఎస్, కాంగ్రెసు, బీజేపీల మధ్య ఓట్ల శాతంలో చాలా వ్యత్యాసం ఉంది. అది క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 2014లో కాంగ్రెసు పార్టీ, టీఆర్ఎస్ లతో పాటు బీజేపీ-టీడీపీ కూటమి గట్టి ప్రత్యర్థులుగా తలపడ్డాయి. అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ఓట్ల కంటే కాంగ్రెసు, బీజేపీ, టీడీపీల మొత్తం ఓట్లు ఎక్కువ. కానీ విడివిడిగా ఆయా పార్టీలు పోటీలో ఉండటం టీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. 38 శాతం ఓట్లతోనే అధికారం దక్కించుకుంది టీఆర్ఎస్. 2018 నాటికి మరింతగా బలపడి తన ఓట్లను, సీట్లను గణనీయంగా పెంచుకుంది. టీడీపీ, బీజేపీలు నామమాత్రమైపోయాయి. కాంగ్రెసు కుదించుకుపోయింది. మొత్తం పరిణామాలను బేరీజు వేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ సింగిల్ పార్టీగా ఆధిక్యంలో ఉంది. మిగిలిన పార్టీల ఓట్లన్నీ కలిసి సంఘటితమైన శక్తిగా రూపుదాలిస్తే తప్ప ఎదిరించడం అంత సులభం కాదు. తెలంగాణలో ఇది దాదాపు అసాధ్యమే. ఈటల రాజేందర్ వంటి వారి ప్రయత్నాలు మీడియా ప్రచారానికి, కొంత తాత్కాలిక రాజకీయ అలజడికి కారణం కావచ్చును. ఒక నియోజకవర్గానికో, జిల్లాకో పరిమితం గా ఉండవచ్చు. అంతే తప్ప రాష్ట్రస్థాయిలో ప్రత్యామ్నాయంగా రూపుదాల్చే అవకాశాలు , ఆ సమయం ఇంకా సమీపించలేదనే చెప్పవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News