మూలాలకే ముప్పు… వ్యవ”‘సాయం” లేనట్లేనా?

దేశంలో పార్టీలు ఎన్ని రాజకీయాలు అయినా చేసుకోవచ్చు. ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం సాధించాలి. అదే వ్యవ‘సాయం’. పరిపాలకులు మాటల్లో ఈ రంగానికి ఇచ్చేంత ప్రాధాన్యం చేతల్లో [more]

Update: 2020-09-25 16:30 GMT

దేశంలో పార్టీలు ఎన్ని రాజకీయాలు అయినా చేసుకోవచ్చు. ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం సాధించాలి. అదే వ్యవ‘సాయం’. పరిపాలకులు మాటల్లో ఈ రంగానికి ఇచ్చేంత ప్రాధాన్యం చేతల్లో కానరాదు. రైతుల నుంచి నేరుగా ఆర్థిక లబ్ధి నేతలకు లభించదు.ఓట్ల సమయం వచ్చేటప్పటికి ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి మచ్చిక చేసేసుకోవచ్చు. అందుకే ఈరంగానికి ప్రచారంలో ఇచ్చిన ప్రాముఖ్యం పని విధానంలో చూబెట్టరు. దేశంలో సగానికిపైగా ప్రజలు వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతుంటారు. అంతటి పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ వారు బలహీనవర్గం కిందే లెక్క. నేతల నిర్ణయాలను ప్రభావితం చేయలేరు. అందుకే ఇన్నేళ్ల స్వాతంత్ర్యంలో ఈ రంగానికి లభించిన సాంత్వన అంతంతే. నాయకులు అన్నదాత అంటూ చేతులెత్తి మొక్కుతారు. అవి ఓట్ల కోసం జోడించిన హస్తాలు. అంతే. జై జవాన్, జై కిసాన్ అంటూ నినదిస్తారు. అవి ఆకర్షణీయమైన స్లోగన్లు మాత్రమే. అన్నదాత ఆకలిని తీర్చలేని ఆత్మ సంతృప్తి నినాదాలు. వ్యవసాయ రంగం జీవనాడి అని ప్రతి నాయకుడూ చెబుతారు. కాంట్రాక్టులు, అభివృద్ధి పనులు, కార్పొరేట్ వ్యవహారాలు, సంక్షేమ పథకాలు ఇవే నాయకులకు కావాల్సింది. ఇందులో ప్రతిచోటా నాయకులకు ప్రత్యక్ష లబ్ధి ఉంటుంది. ప్రభుత్వాలు, పాలకులు పెట్టే ఇతర విషయాలపై పెట్టే శ్రద్ధలో ఇసుమంతైనా వ్యవసాయంపై కరుణించరు. రైతు స్వావలంబనకు చేయూత కనిపించదు. ఎందుకంటే సంఘటిత శక్తి గా రైతు ఇంకా రూపుదాల్చలేదు.

తాజా రగడ…

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంపై తెచ్చిన బిల్లులు దేశంలో అగ్గి పుట్టిస్తున్నాయి. పంజాబ్ , హర్యానా వంటి రాష్ట్రాల్లో వ్యవస్థలే స్తంభించిపోతున్నాయి. దీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉన్న అకాలీ దళ్ సైతం ప్రభుత్వం నుంచి వైదొలిగింది. దేశంలోని అనేక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిజానికి వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం. అయితే కేంద్రం చట్టం చేయడానికి ఆటంకాలేమీ లేవు. కానీ విస్త్రుత ఏకాభిప్రాయం లేకుండా హడావిడిగా బిల్లులు ఆమోదించుకోవడమే అభ్యంతరకరం. పైపెచ్చు రాజ్యసభ వంటి సమున్నత వేదికపై ఓటింగు లేకుండా మూజువాణిగా మమ అనిపించడం మరో విచిత్రం. కోవిడ్ వంటి కల్లోల సమయంలో కంగారు పడాల్సినంతటి అర్జెంటు విషయమా? అంటే కాదనే సమాధానం వస్తుంది. కానీ కేంద్రం మొండిగా ముందుకు వెళుతోంది. రాష్ట్రాలతో సంప్రతింపులు, రాజకీయ పార్టీలతో విస్త్రుత ఏకాభిప్రాయం పక్కన పెట్టేసింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, విక్రయం, నిల్వ, ధరలపై ప్రభావం చూపే విధంగా తయారు చేసిన బిల్లులు దీర్ఘకాల ప్రభావానికి కారణమవుతాయి. చట్ట రూపు దాల్చిన తర్వాత వ్యవసాయం చేస్తున్న రైతులపైనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజల జీవనంపైనా ప్రభావం చూపుతాయనేది నిపుణుల మాట. అంతేకాకుండా ద్రవ్యోల్బణానికి , ఆహార పదార్థాల కొరతకు సైతం దారితీయవచ్చునంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం కార్పొరేటీకరణకు దారితీయవచ్చనేది విపక్షాల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళన.

రక్షణలు కరవు…

దేశంలో దాదాపు అన్ని రంగాలు ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ దిశలోనే ఉన్నాయి. నాలుగింట మూడొంతులు చిన్నాచితక కమతాలతో ఉన్న వ్యవసాయరంగం మాత్రమే ఇంకా కార్పొరేట్ చట్రంలోకి రాలేదు. లాభనష్టాలతో సంబంధం లేకుండా తరతరాలుగా వ్యవసాయాన్నే నమ్ముకున్న జీవిస్తున్నాయి దేశంలో కోట్లాది కుటుంబాలు. ఏదో ఒక పంటను సాగు చేసుకుని దగ్గర్లోని మార్కెట్ ను ఆశ్రయించో, మిల్లర్లకు విక్రయించో బతుకు బండి ఈడుస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల దళారుల ప్రమేయం ఉన్నప్పటికీ సామూహిక దోపిడీ ఇంకా నెలకొనలేదు. కార్పొరేట్ సంస్థల ఒప్పందాలతో నియంత్రిత సాగు విధానం వస్తే రైతులు స్వేచ్ఛ కోల్పోతారు. మరోవైపు ధరలు కొండెక్కుతాయి. నిత్యావసరాల చట్టం నుంచి మినహాయింపులు లభిస్తే అక్రమ నిల్వలకు అడ్డు అదుపు ఉండదు. వీటికి సమాధానం అన్వేషించకుండానే వ్యవసాయ బిల్లులను ఆమోదించడమే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఇప్పటి వరకూ రైతులకు వివిధ పంటలకుగాను కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇది పూర్తిఉపశమనం కాకపోయినప్పటికీ ఊరట లభిస్తోంది. చట్టంలో రైతుకు మార్కెటింగ్ స్వేచ్ఛ కల్పించామనే నెపంతో మద్దతు ధరలకు మంగళం పాడేస్తే జరిగే ప్రమాదం అనూహ్యం.

ఏనాటికో గిట్టుబాటు…

స్వామి నాథన్ కమిషన్ సిఫార్సుల అమలు ఎలాగూ ప్రభుత్వాలకు సాధ్యం కాదు. కనీసం ఎన్డీఏ సర్కారు ఇచ్చిన హామీ అయినా అమలవుతున్న సూచనలు కనిపించడం లేదు. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అయిదేళ్ల క్రితమే సర్కారు సెలవిచ్చింది. పెరిగిన ఖర్చులతో పోల్చి చూసుకుంటే ఇప్పటికి 20 శాతం కూడా ఆదాయం పెరగలేదని రైతాంగం వాపోతోంది. మద్దతు ధరకే క్రమేపీ స్వస్తి వాక్యం పలకాలనుకుంటున్న దశలో గిట్టుబాటు ధర అనేది దింపుడు కళ్లెం ఆశ వంటిదే. నిజానికి కష్ట కాలంలో దేశానికి అండగా నిలుస్తున్నది వ్యవసాయమే. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా సమయంలో భారత్ కు ఆహార సంక్షోభం తలెత్తకుండా ఆదుకున్నది రైతాంగమే. మిగిలిన రంగాలన్నీ పూర్తి సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ ఏడాది మూడు శాతం అభివ్రుద్ధితో తిండికి ఢోకా లేదని దేశ ప్రజలకు భరోసానిచ్చింది వ్యవసాయ రంగం. ఆహార భద్రత, ధరల నియంత్రణ, గిట్టుబాటు మూడు అంశాల ఆధారంగానే ఈరంగాన్ని చూడాలి. వ్యాపార ప్రయోజనాల కోణంలో చూస్తే భవిష్యత్తు అంధకారమయమవుతుంది. కడుపు నింపడం, నిండటం వరకే చూసుకుంటాడు రైతు. కూడబెట్టుకోవడమనే కాన్సెప్టు లేదు. ఇప్పుడు కార్పొరేట్ మయం చేస్తే దేశం గతి తప్పే ప్రమాదం ఉంది. మూలాలకే ముప్పు పొంచి చూస్తోంది. అందుకే వ్యవసాయం వంటి కీలక రంగం విషయంలో అయినా రాజకీయ పార్టీలు స్థూలంగా ఏకాభిప్రాయానికి వచ్చి సంస్కరణలను చేపడితే మంచిది. లేకపోతే వ్యవసాయ విధానాల్లో స్థిరత్వం రాదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News