జగన్ వైపే రోశయ్య శిష్యుడు....!

Update: 2018-06-25 06:30 GMT

మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రియ శిష్యుడు వైసిపి లో చేరేందుకు పూర్తి స్థాయి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎపి ఐఐసి మాజీ ఛైర్మెన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు చేసుకోనున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున రాజమండ్రి నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఆ పార్టీ లో అందరిలాగే ఓటమి చెందారు సుబ్రహ్మణ్యం. అయితే సమైక్యాంధ్ర పార్టీకి రాష్ట్రంలో అత్యధిక ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో రాజమండ్రి కూడా ఒకటి కావడం విశేషం. ఆ ఎన్నికల్లో సుబ్రహ్మణ్యం వ్యక్తిగత చరిష్మా తోనే అన్ని ఓట్లు వచ్చాయన్నది వాస్తవం.

మూడు సార్లు చేదు అనుభవాలే ...

2004,2009,2014 లలో శివరామ సుబ్రహ్మణ్యం మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రకాలుగా భంగపడ్డారు. అంగ అర్ధబలం తో బాటు తూర్పుగోదావరి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న నేత శివరామ సుబ్రహ్మణ్యం. యువజన కాంగ్రెస్ నుంచి రాజకీయాలు ప్రారంభించి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పని చేసి టిడిపి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం జక్కంపూడి రామ్మోహన రావు తో కలిసి చేసి హాఫ్ సెంచరీకి పైగా పోలీస్ కేసులు ఎదుర్కొని చిన్న వయస్సులోనే మంచి అనుభవాలనే ఆయన చవి చూశారు. కార్పొరేటర్ స్థాయి నుంచి పదవీ ప్రస్థానం సాగించిన శివరామ సుబ్రహ్మణ్యం 2004 లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగ పడ్డారు. వైఎస్ ఇచ్చిన హామీతో నాటి పార్టీ అభ్యర్థుల గెలుపుకి ఆయన కృషి చేశారు. తిరిగి 2009 లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లలో బిసి అభ్యర్థి ఒక్కరు లేకపోవడంతో సిట్టింగ్ అభ్యర్థి రౌతు సూర్య ప్రకాశరావు కి వైఎస్ టిక్ పెట్టారు. శివరామునికి నామినేటెడ్ ఖరారు చేశారు వైఎస్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వైఎస్ అకాలమరణం అనూహ్యంగా శివరాముడి గురువు కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి కావడం ఆయనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన ఏపిఐఐసి ఛైర్మెన్ గిరిని రోశయ్య కట్టబెట్టారు సుబ్రమణ్యానికి.

కిరణ్ సీఎం కావడంతో ...

రెండేళ్ళపాటు ఏపిఐఐసి ఛైర్మెన్ హోదాలో ఒక వెలుగు వెలిగిన శివరామ సుబ్రహ్మణ్యం రోశయ్య ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలిగాక రాజకీయంగా దెబ్బతిన్నారు. రాజకీయ ప్రాధాన్యత లేని పోస్ట్ లోకి గాడ్ ఫాదర్ రోశయ్య వెళ్ళిపోవడం, ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరుతో ఆ పార్టీని జనం చీదరించుకోవడంతో చాలామందిలాగే సుబ్రహ్మణ్యం భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అయన సమైక్యాంధ్ర పార్టీ తరపున బరిలోకి దిగి దెబ్బయిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో పరాజయం నేర్పిన పాఠం తో ఆయన గత ఏడాది వరకు ఏ పార్టీలో చేరలేదు.

నంద్యాల ఎన్నికల్లో జగన్ ను కలిసి ...

అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో అక్కడికి వెళ్ళి వైసిపి చీఫ్ జగన్ ను కలిసి వచ్చారు. టికెట్ కన్ఫర్మ్ గా ఇస్తానన్న మాట ఉంటేనే పార్టీలో చేరాలని తొలుత భావించిన ఆయన ఆ దిశగానే చర్చలు జరిపారు. అయితే ఇప్పటికే వైసిపి రాజమండ్రి కో ఆర్డినేటర్ మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్యప్రకాశ రావు కి జగన్ హామీ ఇవ్వడంతో ఆయన పార్టీలో పూర్తి స్థాయిలో చేరేందుకు ఆలోచనలో పడ్డారు. మరోవైపు జనసేన నుంచి కూడా సుబ్రహ్మణ్యం కి ఆఫర్స్ వచ్చాయని ప్రచారం సాగింది. రానున్న ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ లో చేరతారా అని ఆయన వర్గం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. జగన్ పాదయాత్ర రాజమండ్రి చేరుకున్న సందర్భంలో శివరాముడు ఆయన సమక్షంలో చేరుతారనే అంతా ఎదురు చూశారు. కానీ ఆయన శిబిరంలో మౌనమే రాజ్యమేలింది.

ఎట్టకేలకు వైసిపి లోకే ...

రాజమండ్రిలో రాబోయే ఎన్నికల్లో క్రీయాశీలకం, కీలకం అవుతారనుకుని అంతా భావించినా ఆయన ఏ నిర్ణయం తీసుకోక పోవడంతో రాజకీయాలపై అనాసక్తి గా వున్నారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన పొలిటికల్ స్క్రీన్ పై రీ ఎంట్రీకి సిద్ధమైపోయారు. మంగళవారం దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసి మంచిరోజు చూసుకుని తూర్పుగోదావరి జిల్లాలోనే వున్న వైసిపి చీఫ్ ను తన అనుచరులతో కలిసి అధికారికంగా పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు సన్నిహితులు నుంచి సమాచారం.

రాజమండ్రి సీటుకి పోటీ పెరుగుతుందా ...?

వైసిపి లోకి శివరామసుబ్రమణ్యం ఎంటర్ అయితే రాజమండ్రి అసెంబ్లీ సీటుకు వైసిపి లో రెండు వర్గాలు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వచ్చినట్లే. ఇప్పటికే గత ఆరుఏళ్ళుగా నియోజకవర్గంలో నెట్ వర్క్ చేసుకోవడంతో పాటు పార్టీ బాధ్యతలు మోస్తున్న మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్య ప్రకాశరావు కి శివరాముడు టికెట్ రేసులో పోటీ పడటం ఖాయం అవుతుంది. అదే జరిగితే రౌతు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. వీరిద్దరి నడుమ జగన్ సర్దుబాటు చేసే శివరాముడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక ఎన్నికల ముందు సర్వేల ప్రకారం టికెట్ కేటాయిస్తారా అన్నది చూడాలి.

Similar News