శబరిమలలోకి మహిళల ప్రవేశం.. నిర్ణయం సర్కారుదేనా?

Update: 2016-11-07 12:30 GMT

మతాల పరంగా ఒక్కొక్క ఆలయంలో ఒక్కో రీతిలో ఆచార సాంప్రదాయాలు అమలులో ఉంటాయి. అయితే ప్రభుత్వాలు ఆ ఆచారాల విషయంలో జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుంది? నిజానికి ఇది చాలా పెద్ద చర్చనీయాంశం అయిన విషయం. మత వ్యవహారాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం అనేది.. సెక్యులర్ గా చెప్పుకోవడానికి తపన పడే హిందూ మతాచారాల విషయంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తప్ప.. ఇతర మతాల విషయంలో వేలు పెట్టడానికి సాహసించవు అనేది.. చాలా కాలంగా ఉన్న అపప్రధ. ఇప్పుడు అలాంటిదే మరో అంశం కూడా తాజాగా తెరమీదకు వస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన శబరి మలై ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి కోర్టు విచారణ సాగిస్తుండడం, ప్రభుత్వం జోక్యం చేసుకుని.. తమకు అభ్యంతరం లేదంటూ.. ఆలయ ట్రస్టుబోర్డు మనోభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

ముందే చెప్పుకున్నట్లు మతాచారాలు ఒక్కొక్క ఆలయం విషయంలో ఒక్కోరీతిగా అమలులో ఉంటాయి. అనేక ముస్లిం మసీదుల్లోను మహిళలకు ఒక పరిమితమైన స్థలం వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే అనేక హిందూ ఆలయాల్లోనూ మహిళల ప్రవేశానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలను ఆంక్షలుగా, నిషేధాలుగానూ చెబుతుండడం కద్దు. ఏది ఏమైనప్పటికీ శబరిమలై లోనూ రుతుక్రమానికి గురయ్యే వయస్సులో ఉండే మహిళలకు ప్రవేశం ఇక్కడ నిషిద్ధం. అయితే దీనిని మహిళల పట్ల వివక్షగా కొందరు ప్రచారం చేయడం విశేషం. మహిళల పట్ల వివక్ష అయ్యేట్లయితే.. పిల్లలు, వయస్సులో పెద్దవారిని మాత్రం ఎందుకు అనుమతిస్తారనేది ఆలయ వర్గాలవాదన! మొత్తానికి నడివయసు మహిళలను అనుమతించకపోవడం అనేది వివాదంగా నడుస్తోంది.

దీనిని సుప్రీం కోర్టు విచారిస్తుండగా.. కేరళ ప్రభుత్వం మహిళలను అనుమతించడానికి తమకు అభ్యంతరం లేదని కోర్టులో తమ వాదన నమోదు చేసేసింది. ఒకవైపు ఆలయ ట్రస్టుబోర్డు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. సహజంగానే ప్రభుత్వ నిర్ణయానికి మహిళా సంఘాలు జై కొట్టాయి. అదే సమయంలో.. ఆచారాలకు పెద్దపీట వేసే మహిళలు ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుండడం విశేషం.

మతవ్యవహారాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం ఎంతవరకు సబబు అనే చర్చ ఇంకా సజీవంగానే ఉంది. దీన్ని ఆడవారి పట్ల వివక్షగా పేర్కొనవచ్చా? అనేది ఇంకా చర్చనీయాంశమే.

ఇలాంటి విషయాలు అసలు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం.. అనేది ఆలోచించాలి. మతాచారాలు అనేవి కాలానుగుణంగా మారుతూ ఉండాల్సిందేననే విషయంలో ఎవ్వరికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే.. మతాచారాల విషయంలో మార్పుచేర్పులకు సంబంధించిన నిర్ణయ స్వేచ్ఛ కూడా ఆయా ఆలయ పాలక మండలులు, అక్కడ పాటించే ఆగమ విధివిధానాలకు అనుగుణంగా జరిగేలా చూడాలి. అంతే తప్ప.. ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్నది కదాని.. విశ్వాసాలకు వ్యతిరేకంగా.. నిర్ణయాల్ని బలవంతంగా రుద్దితే అది సబబని ఎలా అనిపించుకుంటుంది? ఆలోచించాలి.

Similar News