హీరో కోటరీ- నిర్మాతను మార్చేసే సంస్కృతి!

Update: 2016-10-25 04:34 GMT

నిర్మాత అంటే సినిమాకు డబ్బు పెట్టేవాడు! జనరల్ గా డబ్బు తనది, వ్యాపారం తనది! సినిమా నిర్మాణం ఎప్పటికప్పుడు బ్రేకుల్లేకుండా ముందుకు సాగాలంటే.. డబ్బు విడుదల చేయాల్సింది తనే గనుక.. మిగిలిన క్రాఫ్ట్ ల పరిస్థితి అంతా ఆయన ఇష్టానుసారం నడుస్తుంటుంది. అందుకే చాలా సినిమా ప్రాజెక్టుల్లో మధ్యలో రచయితలు మారిపోవడం, డైరక్టర్లు మారిపోవడం , ఒక్కొక్కసారి హీరో కూడా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజా ట్విస్టు ఏంటంటే.. హీరోకు సంబంధించిన కోటరీ ఏకంగా నిర్మాతనే మార్చేస్తున్నారు. పైగా సదరు హీరో ఏమైనా మెగాస్టారా.. నిర్మాత ఆర్థిక స్థోమత మీద నమ్మకం లేక మార్చేస్తున్నారా.. అలా కనిపించడం లేదు. హీరో తన ఖాతాలో ఒక ఫ్లాప్ మాత్రమే కలిగి ఉన్న యంగ్ నటుడు. అలాంటి వారి కోటరీనే.. నిర్మాతను మార్చేయడం అనేది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో సంచలనం అవుతోంది.

నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను అతి కష్టమ్మీద హీరో చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏకంగా వివి వినాయక్ లాంటి అగ్రశ్రేణి దర్శకుడిని పెట్టుకుని.. కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా తీస్తే.. థియేటర్లకు ఎదురు డబ్బులు చెల్లించి.. రోజులు కౌంట్ కోసం లాగించాల్సి వచ్చిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఆ క్రమంలో పెట్టుబడి కాకుండా మరింత అప్పుల పాలైపోయాడని కూడా పుకార్లు వచ్చాయి.

తీరా ఇప్పుడు కొడుకు హీరోగా మరో సినిమాకు బెల్లంకొండ సురేష్ రంగం సిద్ధం చేస్తున్నారు. రెండో సినిమాకు కూడా ఏమాత్రం తగ్గకుండా మాస్ మసాలా బ్లాక్ బస్టర్ లకు పేరుమోసిన బోయపాటి శ్రీనును ఎంచుకున్నారు. నామా అభిషేక్ ఈ సినిమాకు నిర్మాత.

అయితే తాజాగా నిర్మాతను మార్చినట్లుగా తెలుస్తోంది. సినిమా నిర్మాణంలోకి పెద్దఎత్తున ఎంట్రీ ఇచ్చిన నామా అభిషేక్.. దీనితో పాటూ మరో మూడు చిత్రాలు చేస్తున్నారట. తన కొడుకు సినిమా మీద వారు శ్రద్ధ పెట్టకపోతే ఎలా అని బెల్లంకొండ సురేష్ కు అనుమానం వచ్చిందిట. అంతే నిర్మాతను మార్చేసి.. రవీంద్రరెడ్డి అనే నిర్మాతకు తన కొడుకు చిత్రాన్ని తీసే అవకాశం ప్రసాదించినట్లుగా వినిపిస్తోంది. అయినా తన కొడుకు చిత్రం గనుక.. నిర్మాత కొంత భరిస్తే.. బెల్లంకొండ సురేష్ కూడా తన పేరు బయటకు రాకుండా కొంత వాటా వ్యయం భరించడానికి సిద్ధంగా ఉంటారని.. ఆ వాటాల సంగతి తేలనందునే నామా అభిషేక్ తప్పుకున్నారని ఓ పుకారు వినిపిస్తోంది. అయినా కొడుకును హీరో చేయదలచుకున్నాక.. ఆ బాధ్యత మొత్తం తనే తీసుకుంటే.. లాభాలు మొత్తం తనకే మిగులుతాయి కదా.. బెల్లంకొండ సురేష్ ను ఎవ్వరూ సరిగా గైడ్ చేయడం లేదేమో.

Similar News