హతవిధీ.. మోదీ సభకు రావడమూ వార్తేనా?

Update: 2016-12-14 07:00 GMT

ఈ దేశానికి మంచీ చెడూ నిర్ణయించే అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ అయిన పార్లమెంటు జరుగుతున్నప్పుడు , సదరు పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడం కంటె ఒక దేశ ప్రధానికి వేరే పనేం ఉంటుంది. నిజానికి పని కాదు కదా... అది ఆయన బాధ్యత. సభ్యలుకంటె కూడా ప్రధాని స్వయంగా సభకు విధిగా హాజరు కావాలి. సభ్యుల చర్చోపచర్చలు ఎలా జరుగుతున్నాయో గమనించి.. తమ ప్రభుత్వ గమనంలో మార్పు చేర్పులు అవసరమైతే చేసుకోవాలి. కానీ.. మన దేశంలో పరిస్థితి ఎలా తయారైందంటే.. ప్రధానమంత్రి మోదీ సభకు రావడం అనేదే ఒక వార్త అయిపోతోంది. సమాచార మంత్రి వెంకయ్యనాయుడు ఆ విషయాన్ని ప్రత్యేకం ప్రకటిస్తున్నారు. రాబోయే మూడు రోజుల పాటూ మోదీ సభకు వస్తారు.. అంటూ ముందే తెలియజేస్తున్నారు.

నోట్ల రద్దు వలన తలెత్తిన గందరగోళంపై మోదీ సభలో సమాధానం ఇవ్వాల్సిందేనంటూ విపక్షాలు చాలా రోజులుగా గొడవ చేస్తున్నాయి. మోదీ సభకు హాజరు కాకుండా పలాయనమంత్రం పఠిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నాయి. వారికి జవాబు అన్నట్లుగా.. మోదీ సభకు వస్తారనేది కూడా ఓ విశేషంలాగా వెంకయ్య ప్రకటిస్తున్నారు.

అయితే మోదీ సభకు వచ్చినంత మాత్రాన.. మౌనంగా కూర్చుంటే ఉపయోగం ఏముంటుంది? విపక్షాలు చెబుతున్నట్లుగా.. మోదీ సభలో మాట్లాడకుండా... బయట, సభల్లో జనాన్ని మాయ చేయడమే లక్ష్యం అన్నట్లుగా వార వద్ద తనదైన ప్రసంగాలు వినిపిస్తే దేశ ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? స్వదేశీ నల్లధనం విషయంలో ఇప్పుడు గణాంకాలతో కూడిన వాస్తవాలు మారుతున్నాయి. ఇప్పటికే 35 రోజులకు పైగా గడిచాయి. ఇలాంటి సమయంలో.. మోదీ సర్కారు తాము తీసుకున్న చర్య గురించి, సాధించిన విజయాల గురించి, సత్ఫలితాల గురించి సభకు చెప్పవలసిన బాధ్యత ఉంది.

పదేపదే విలువల గురించి మాట్లాడే, స్వచ్ఛమైన రాజకీయాల గురించి చెబుతూ ఉండే ప్రధాని మోదీ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించడం కూడా తన బాధ్యతే అనే సంగతి గుర్తంచుకోవాలి. కాబట్టి.. ప్రధాని మూడు రోజుల పాటూ సభకు రావడం అనేది వార్త కాదు.. ఆయన సభలో సమాధానం చెప్పబోతున్నారా? ప్రభుత్వం వాదనను వినిపించబోతున్నారా? అనేదే ప్రధానమైన అంశమని, విపక్షాలు మాత్రమే కాకుండా, దేశంలోని ప్రజలు కూడా అందుకోసం ఎదురుచూస్తున్నారని పాలకులు తెలుసుకోవాలి.

Similar News