Macharla : ఎవరూ ఏమీ సుద్దపూసలు కాదయ్యా బాబూ.. అక్కడ పోలింగ్ అంటే అంతే బాసూ?

ఎవరికి బలం ఉన్న చోట వాళ్లు రిగ్గింగ్ లు చేసుకోవడం మాచర్లలో సహజంగా జరిగే విషయమే. అక్కడ పోలింగ్ సిబ్బంది కేవలం నామమాత్రమే

Update: 2024-05-22 13:30 GMT

ఎవరికి బలం ఉన్న చోట వాళ్లు రిగ్గింగ్ లు చేసుకోవడం మాచర్లలో సహజంగా జరిగే విషయమే. అక్కడ పోలింగ్ సిబ్బంది కేవలం నామమాత్రమే. వాళ్లు ప్రేక్షకపాత్ర మాత్రమే పోషిస్తారు. ఎందుకంటే ఎవరూ ప్రాణాల మీదకు కొని తెచ్చుకోరు కదా? అందుకే మాచర్లలో ఇటు వైసీపీ కానీ, అటు టీడీపీ కానీ ఎవరూ నిజాయితీ పరులు కారన్నది కాదనలేని వాస్తవం. ఎవరికి స్థాన బలమున్న చోట వాళ్లు రిగ్గింగ్ చేసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. అక్కడి స్థానికనేతలే రిగ్గింగ్ చేసి అన్నా.. ఇన్ని ఓట్లు మేం ఏసేశాం అంటూ బహిరంగంగానే గొప్పలు చెప్పుకుంటున్నా ఆ మాటలు కూడా పోలీసుల చెవికి ఎక్కదు. ఎందుకంటే ఎందుకొచ్చిన గొడవ అని పోలీసుల నుంచి ఎన్నికల అధికారుల వరకూ సర్దుకు పోతుంటారు.

నాటి నుంచే...
మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి బ్రహ్మారెడ్డి రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ సంగతి పోలీసులకు తెలియని విషయం కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బలమున్న చోట ఆయన అనుచరులు రిగ్గింగ్ చేస్తారు. అలాగే జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరులు ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడతారు. కేవలం పిన్నెల్లి మాత్రమే ఈవీఎంను పగులకొట్టలేదు. టీడీపీ నేతలు కూడా ఈవీఎంలను పగులకొట్టారు. వారిపై కొందరిని పోలీసులు పట్టుకున్నారు. మరికొందరు తప్పించుకుని తిరుగుతున్నారు. స్థాన బలం ఉన్న చోట రెచ్చి పోవడం మాచర్ల నియోజకవర్గం స్పెషాలిటీ. అక్కడి ప్రజలకు ఇది కొత్తేమీ కాదు.
ఆ వీడియోలను కూడా...
కాకుంటే ఏకంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో అదివైరల్ గా మారింది. అదే ఆయన అనుచరులతో ఆ పని చేయించి ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదన్నది వైసీపీ నేతల వాదన. అంతకు ముందు అదే పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు వైసీపీ ఏజెంట్లను బయటకు నెట్టిన దృశ్యాలను కూడా బయటపెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా అనేక చోట్ల మాచర్లలో ప్రేక్షక పాత్ర పోషించారనే చెప్పాలి. ఎవరితో గొడవ పెట్టుకుంటే ఎందుకొచ్చిన కష్టం? అన్న రీతిలో పోలీసులు వ్యవహరించారు. పోలీసు అధికారులను మార్చినా అక్కడ పరిస్థిితి మాత్రం మారలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బటన్ నొక్కకుండానే 90 శాతం పోలింగ్ నమోదయిందంటే అది రిగ్గింగ్ కాక ఏమనాలన్న ప్రశ్నకు ఎన్నికల కమిషన్ వద్ద కూడా సమాధానం లేదు.
రీపోలింగ్ కు...
తమ వద్దకు ఫిర్యాదులు వచ్చినా, ఆధారాలుంటేనే రీపోలింగ్ చేస్తామని చెప్పడం సమంజసం కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలు, రిగ్గింగ్ లకు పార్టీ నేతలది ఎంత బాధ్యతో అధికారులదీ అంతే బాధ్యత. వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రీపోలింగ్ విషయంలో కూడా ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా, వీడియోలను చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అసలే అక్కడ ప్రజాస్వామ్యం పాళ్లు తక్కువ. ఇక ఈసీ కూడా తాము రీపోలింగ్ కు ఆదేశించమని మొండి కేసినా ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలిగించినట్లే అవుతుందన్న కామెంట్స వినపడుతున్నాయి. మొత్తం మీద మాచర్ల నియజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News