Ap Elections : ఆరు జిల్లాలలో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందా? అదే నిజమయితే.. ఇక ఆపేదెవరు?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల్లో ఇంకా టెన్షన్ మాత్రం అలాగే ఉంది.

Update: 2024-05-25 07:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల్లో ఇంకా టెన్షన్ మాత్రం అలాగే ఉంది. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో అంచనాలు ఎవరికీ అందడం లేదు. ఎవరికి వారే పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలంగానే చెప్పుకుంటున్నారు. కౌంటింగ్ జరిగే నాలుగో తేదీ వరకూ ఎవరిది గెలుపు అన్నది తెలయకున్నప్పటికీ అనేక సర్వేలు.. విశ్లేషణల కోసం నాయకుల నుంచి క్యాడర్ వరకూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడం వల్ల ఎవరికి ప్రయోజనం అన్న దానిపై కూడా అనేక రకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై కసితోనే అంత పెద్ద సంఖ్యలో జనం పోలింగ్ కు క్యూ కట్టారని కూటమి నేతలు అంటుంటే.. ఈసారి పాజిటివ్ ఓటు కారణంగానే ఇంత స్థాయిలో ఓటింగ్ జరిగిందని అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు.

వైసీపీ ధీమా...
ప్రచారంలోనూ జగన్ తనకు మంచి చేస్తేనే ఓటు వేయాలని కోరడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ అంటూ ఒక వర్గాన్ని తన సొంతం చేసుకునేందుకు జగన్ ప్రయత్నించారు. దీంతో పాటు ప్రతి ఎన్నికల మాదిరిగా కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా తరలించడంలో వైసీపీ కూడా ముందంజలోనే ఉందంటున్నారు. బస్సులు, రైళ్లలో వచ్చిన వాళ్లంతా తమకే మద్దతు పలుకుతారని, కార్లు, విమానాల్లో వచ్చిన వారు తమకు యాంటీ చేసి ఉండవచ్చన్న అభిప్రాయం కూడా వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వైసీపీలో ఈసారి గెలుపు తమదేననన్న ఆత్మవిశ్వాసం అయితే పుష్కలంగా కనపడుతుంది. అధినేత జగన్ నుంచి కిందిస్థాయి క్యాడర్ వరకూ గెలుపు ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం కూడా ఆలోచింప చేస్తుంది.
కూటమి కూడా...
మరో వైపు కూటమి పార్టీలు కూడా అంతే నిబ్బరంగా ఉన్నాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత అడుగడుగునా కనపడిందంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మారితేనే తమ భవిష్యత్ బాగుపడుతుందన్న అంచనాకు వచ్చిన ప్రజలు పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారని చెబుతున్నారు. దీంతో పాటు టీడీపీ ప్రకటించిస సూపర్ సిక్స్ కూడా సూపర్ హిట్ అయిందంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ప్రతి మహిలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన హామీ పనిచేయడం వల్లనే మహిళలు పెద్దయెత్తున తరలివచ్చారంటున్నారు. కర్ణాటక, తెలంగాణలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చి అక్కడ ప్రభుత్వాలు మారడానికి గ్యారంటీలు కారణమని కూటమి నేతలు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు.
ఐ ప్యాక్ సంస్థ మాత్రం...
అయితే ఐప్యాక్ సంస్థ ముఖ్యమంత్రి జగన్ కు ఇచ్చిన నివేదికలో 156 స్థానాలు వస్తుందని చెప్పినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అందులో ఆరు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా ఐప్యాక్ సంస్థ నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గత ఎన్నికల్లో కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మరో రెండు జిల్లాలు అధికంగ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు నివేదిక రావడంతో వైసీపీ నేతల్లో ఆనందోత్సహాలు వెల్లవిరిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత మాత్రం వాస్తవముందన్నది బయటకు తెలియక పోయినప్పటికీ ఏ జిల్లాలో ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు లేవన్నది టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడు క్లీన్ స్పీప్ ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద క్లీన్ స్వీప్ జిల్లాలపై కూడా బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News