Ap Elections : ఆర్కే రోజాకు ముందే తెలిసిపోయిందా? అందుకే అలా వాయిస్ ఛేంజ్ అయిందా?

నగరి నియోజకవర్గంలో గెలుపు ఎవరిదన్న చర్చ కన్నాఈసారి రోజా గెలుపు కష్టమేనట అన్న మౌత్ టాక్ ఏపీ అంతటా స్ప్రెడ్ అయింది

Update: 2024-05-25 06:34 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అన్న ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. అయితే అదే సమయంలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో నేతల పరిస్థితిపై కూడా క్యాడర్ నుంచి సామాన్య ప్రజల వరకూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. అందులో నగరి నియోజకవర్గం ఒకటి. నగరి నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అన్న చర్చ కన్నా .. ఈసారి రోజా గెలుపు కష్టమేనటగా అన్న మౌత్ టాక్ ఇప్పటికే ఏపీ అంతటా స్ప్రెడ్ అయింది. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. ఆర్కే రోజా ఓటమి చెందుతుందని కొందరు భారీగా బెట్టింగ్ లు కూడా కాసేందుకు రెడీ అయిపోయారంటే ఏ రేంజ్ లో రోజాపై ప్రచారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి నగరిలో 87 శాతం పోలింగ్ నమోదయింది.

ఇంటి శత్రువులే...
ఆర్కే రోజాకు బయట శత్రువులకంటే ఇంటి శత్రువులే అధికంగా ఉన్నారు. రోజాను ఓడించేందుకు అన్ని శక్తులూ ఒక్కటయ్యాయని అంటారు. అదీవైసీపీకి చెందిన నేతలే.. వైసీపీలో కీలక పదవులు అనుభవించిన వారే రోజాను ఈసారి ఓడించాలన్న కసితో పనిచేశారంటున్నారు. ఇంటింటికీ వైసీపీ నేతలు తిరుగుతూ రోజాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, తనకు సొంత పార్టీ నేతలే వెన్ను పోటు పొడిచారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఆర్కే రోజా తన పదేళ్ల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మిత్రులను ఎంత స్థాయిలో పెంచుకున్నారో.. అంతే స్థాయిలో శత్రువులను కూడా పెంచుకున్నారంటారు. రోజా సోదరుడు అంతా నియోజకవర్గంలో కీలకంగా మారి అన్ని పదవులు కొందరికే కేటాయించారన్న విమర్శలను రోజా ఎప్పటి నుంచో ఎదుర్కొన్నారు.
అందరినీ దూరం చేసుకుని...
మరోవైపు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి వంటి వాళ్లతోనూ ఆమె కు పొసగదు. ఈ ఫ్యాక్టర్ కూడా పనిచేసిందంటారు. రోజా తనకు ఏకైక నాయకుడు జగన్ ఒక్కడేనని మొండిగా.. సొంత పార్టీ నేతలను దూరం చేసుకునేలా వ్యవహరించారని, దాని ఫలితం ఇప్పుడు చవి చూడాల్సి వస్తుందని రోజా సన్నిహితులు సయితం వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ హైకమాండ్ కు రోజా పలుమార్లు ఫిర్యాదు చేసినా వారిని నచ్చచెప్పేందుకు స్వయంగా జగన్ రంగంలోకి దిగి ప్రయత్నించినా చివరి క్షణంలో వారంతా రోజాకు హ్యాండిచ్చారన్న టాక్ మాత్రం నడుస్తుంది. అదే జరిగితే రోజా ఈసారి గెలుపు అంత సులువు కాదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రోజా తన వైఖరితోనే తాను కష్టాలు కొని తెచ్చుకున్నారన్నది ఆ పార్టీకి చెందిన నేతలే అంగీకరిస్తున్నారు.
ప్రత్యర్థి బలంగా...
మరోవైపు ఆర్కే రోజా 2014 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ను తెచ్చుకున్న రోజా గెలుపొందారు. 2019 ఎన్నికలలో చివరి వరకూ టిక్కెట్ దక్కదని అందరూ అనుకున్నా ఆఖరి క్షణంలో జగన్ ఆమె పేరునే ఖరారు చేశారు. ఆర్కే రోజా మంచి వక్తే కావచ్చు. వైసీపీలో జగన్ కు అత్యంత నమ్మకమైన నేత కావచ్చు. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం అయినవారిని దూరం చేసుకుని కష్టాల్లో పడ్డారన్నారు. మరోవైపు గాలి కుటుంబానికి సానుభూతి కూడా బలంగా ఉంది. అంతేకాకుండా కూటమితో పోటీ చేయడం వల్ల గాలి భానుప్రకాష్ ఈసారి గట్టి పోటీ ఇచ్చారన్నది మాత్రం కాదనలేని వాస్తవం. ఈ ఐదేళ్లలో ఆమె పై వచ్చిన ఆరోపణలు ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలే చేయడంతో ఆమె జనంలో మరింత పలుచన అయ్యారంటారు. మొత్తం మీద మౌత్ టాక్ మాత్రం రోజమ్మకు ఈసారి కష్టాలు తప్పేట్లు లేవనే వినిపిస్తుంది. మరి చివరకు ఏం జరుగుతుందన్నది మాత్రం చూడాల్సి ఉంది.


Tags:    

Similar News