స్పీకరు నిర్ణయానికి మార్గదర్శనం హరీశ్ దేనా?

Update: 2016-10-29 05:37 GMT

ఎన్నికల్లో తాము గెలిచిన పార్టీనుంచి ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలా వద్దా? అనేది అసెంబ్లీ స్పీకరు విచక్షణాధికారానికి సంబంధించిన విషయం. ఈ విషయంలో ఆయన తనకు అవసరమైనంత వ్యవధి తీసుకుని ఓ నిర్ణయానికి రావొచ్చు. ఎక్కడ నిర్దిష్టమైన గడువులు ఏమీ లేవు. అయితే తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం రచ్చ రచ్చగా మారుతున్న ఈ అనర్హత వేటు విషయంలో.. స్పీకరు తీసుకోబోయే నిర్ణయం అనేది.. శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు గైడెన్స్ లో రూపు దిద్దుకోనున్నట్లుగా కనిపిస్తోంది.

నవంబరు 8వ తేదీలోగా.. అనర్హత విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత గడువు కావాలో స్పష్టంగా చెప్పాలంటూ స్పీకరును సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రత్యమ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? సుప్రీం కోర్టు ఆదేశించిందా? వ్యాఖ్యలు మాత్రమే చేసిందా? మనం ఎలా స్పందిస్తే.. విషయాన్ని తేల్చకుండా సాగతీయడం సాధ్యం అవుతుంది. వంటి వివరాల గురించి మంత్రి హరీశ్ రావే.. అందుబాటులో ఉన్న అధికారులు, అడ్వొకేట్ జనరల్ లతో మీటింగు పెట్టి చర్చలు సాగించి నిర్ణయానికి వస్తున్నారు.

స్పీకరు మధుసూదనాచారి నగరానికి వచ్చిన తరువాత.. ఆయనకు బ్రీఫ్ చేసి.. ఆయన ద్వారా సుప్రీంకు సమాధానం ఇప్పించాలనేది ఆలోచన.

కాంగ్రెస్, తెలుగుదేశం లనుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వేసిన కేసు ఇప్పుడు సుప్రీం కోర్టులో ఈ దశ వరకు వచ్చింది. స్పీకరు తనకు ఎంత సమయం కావాలో చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు అడుగుతోందే తప్ప.. సత్వరం నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఆదేశించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ స్పీకరు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను వాడుకుని, ఈ అంశాన్ని ఇంకా రెండేళ్లపాటు నాన్చడానికే చూడవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే.. స్పీకరు చేయాల్సిన కసరత్తు మొత్తం మంత్రి హరీశ్ రావు పూర్తిచేసి.. ఆయనకు ఫైనల్ రిజల్ట్ మాత్రం సూచించి, ఆ మేరకు సుప్రీం కు లేఖ రాయమని చెప్పేలా ప్రస్తుత వాతావరణం కనిపిస్తుండడమే చిత్రంగా ఉంది.

Similar News