స్పర్ధయా వర్ధతే : కేసీఆర్ ఓర్వలేకపోతున్నారా?

Update: 2016-10-29 05:00 GMT

స్పర్ధయా వర్ధతే విద్యా అంటారు పెద్దలు. అంటే ఒకరిని చూసి ఒకరికి అసూయ, ఓర్వలేని తనం, అసూయ లాంటివి ఉండడం వల్ల విద్యార్థులుగా ఉన్నప్పుడు లాభిస్తుందని, దానివల్ల విద్య మరింతగా పరిఢవిల్లుతుందని ఆ సంస్కృత సూక్తి చెబుతుంది. కానీ ఈ ‘స్పర్ధ’ వలన పరిపాలనలో కూడా అంతో ఇంతో మేలు జరిగేలా వాతావరణం కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య ఉన్న స్పర్ధ మరియు పోటీ వాతావరణం అనేది... రెండు రాష్ట్రాల్లో కొత్త కొత్త భవన సముదాయాల నిర్మాణానికి వారు తొందరపడేలా.. ఒకరిని మించి ఒకరు తమ ముద్ర తమ రాష్ట్రంపై చూపించుకోవడానికి ఆత్రుత పడేలా వాతావరణం కనిపిస్తోంది.

అక్కడేదో అమరావతిలో అసలంటూ మైదానం లాంటి సేకరించిన పొలాలు తప్ప.. మరేమీ లేవు గనుక.. అక్కడ ఓ రాజధాని నిర్మించడానికి భవనాలు కట్టడానికి చంద్రబాబునాయుడు సర్కారు తొందరపడుతోందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఇక్కడ తెలంగాణలో సచివాలయం రూపేణా పని చేసుకోవడానికి చక్కగా అనువుగా ఉన్న భవనాలు అన్నింటినీ కూలగొట్టించేసి మరీ.. తక్షణం కొత్త భవనాల సముదాయం, భారీ ఆకాశహర్మ్యం నిర్మించేయాలని కేసీఆర్ ఉత్సాహపడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పొరుగురాష్ట్రంలో ఏదో కట్టేస్తున్నారు. మనం కూడా ఏదో ఒకటి కట్టేయాల్సిందే.. అనే పోకడలు పాలకుల్లో పెరిగినట్లుగా కనిపిస్తోంది.

అయినా రెండు రాష్ట్రాల పాలకుల మద్య స్పర్ధ ఉండడం మంచిదే. అయితే ఆ స్పర్ధ, ఆ పోటీ వాతావరణం అనేది జనసంక్షేమ పథకాలకు సంబంధించి ఉంటే ఎంతో బాగుండేది. జనానికి మేలు జరిగేది. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం సర్కారు సొమ్మును తగలేసి భవనాలు కట్టడం- అనే అంశంలో మాత్రమే పోటీపడుతున్నారు. అది శోచనీయం.

Similar News