సోషల్ మీడియా వేదికగా జేఏసీ పోరు

Update: 2017-01-25 09:30 GMT

ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలోని టీజేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ప్రజాపోరాటాలకు సిద్ధమవుతోంది. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఒకవైపు ఎండగడుతూనే..తమ గొంతును సోషల్ మీడియాలో విన్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

అవగాహనకు శిక్షణ....

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై నినదించేందుకు ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ లను వినియోగించుకోవాలని టీజేఏసీ నిర్ణయించింది. భూసేకరణ, రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలు, వ్యవసాయం, నిరుద్యోగం వంటి అంశాలపై ఇక టీజేఏసీ సోషల్ మీడియా సాక్షిగా చెలరేగిపోనుంది. ఇందుకోసం శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించాలనుకుంటోంది. సోషల్ మీడియాపై అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను ప్రారంభించి ప్రభుత్వ విధానాలను తూర్పార పడుతోంది. తమ కార్యాచరణనూ అందులో ప్రకటిస్తూ వస్తోంది. ఇక వెబ్ సైట్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోకి కూడా ఎంటర్ అవుతామని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. సోషల్ మీడియాతో యూత్ కు దగ్గరవ్వాలని ప్రొఫెసర్ ఆలోచనగా ఉంది. వెబ్ సైట్ తో పాటుగా త్వరలో ఓ మంత్లీ మ్యాగ్ జైన్ కూడా తెచ్చేందుకు టీజేఏసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీజేఏసీ ఒక వాట్స్ ప్ గ్రూప్ ను నిర్వహిస్తోంది. మొత్తం మీద ప్రొఫెసర్ గారి సోషల్ మీడియా పోరాటం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. జల్లికట్టు ఉద్యమానికి ఒక వాట్స్ ప్ మెసేజ్ తోనే లక్షలాది మంది మెరీనాబీచ్ వద్దకు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా టీజేఏసీ గుర్తు చేస్తోంది. ఇకపై సోషల్ మీడియా ద్వారానే నిరసనల పిలుపులుంటాయని చెబుతోంది.

Similar News