సెప్టంబర్ 22న పోయెస్ గార్డెన్ లో ఏం జరిగింది?

Update: 2017-02-07 08:00 GMT

జయలలితపై విషప్రయోగం జరిగిందా? జయలలితను నెట్టి పడేశారా? సెప్టంబరు 22వ తేదీన పోయెస్ గార్డెన్ లో ఏం జరిగింది. ఇదే తమిళనాడు అంతటా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన నివాసమైన పోయెస్ గార్డెన్ లో ఘర్షణ జరిగినట్లు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత పాండ్యన్ ఆరోపించారు. ఆరోజు పోయెస్ గార్డెన్ లో గొడవ జరిగిందని, కొందరు జయను నెట్టివేయడంతో ఆమె కిందపడిపోయారని పాండ్యన్ ఆరోపిస్తున్నారు. అదే రోజు సాయంత్రం జయను అపోలో ఆసుపత్రికి తరలించారు.

జయను కిందకు నెట్టేశారా?

అన్నాడీఎంకేలో ఎంజీ రామచంద్రన్ హయాం నుంచి పాండ్యన్ కొనసాగుతున్నారు. ఆయన గతంలో స్పీకర్ గా కూడా పనిచేశారు. సీనియర్ నేత ఆరోపణలతో జయ మరణంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పురచ్చతలైవి విషమ పరిస్థితుల్లోనే ఆసుపత్రికి వచ్చారని సోమవారం అపోలో ఆసుపత్రి డాక్టర్లు ప్రెస్ మీట్ మరీ చెప్పారు. పరిస్థితి విషమించేంత వరకూ జయను ఆసుపత్రికి ఎందుకు తీసుకురాలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆమెను కావాలనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పోయెస్ గార్డెన్ లోనే ఉంచారా? లేక ఇతర వైద్యులతో వైద్యసహాయం అందించారా? అన్నది కూడా అపోలో ఆస్పత్రి వైద్యులు చెప్పలేదు. ఆమె రక్తంలో ఇన్ ఫెక్షన్ ఉందని చెప్పడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా పాండ్యన్ లేవనెత్తిన ప్రశ్న మరింత బలమై శశికళ మెడకుచుట్టుకునే అవకాశమున్నట్లుంది. పోయెస్ గార్డెన్ లో ఏది జరిగినా అందుకు పూర్తి బాధ్యతను చిన్నమ్మ వహించాల్సిందే. ఎందుకంటే జయను కనిపెట్టుకుని చివర వరకూ ఉన్నది ఆమే కాబట్టి. ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన చిన్నమ్మ నోరు మెదపకపోవడం కూడా అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కనీసం జయ రక్తసంబంధీకులను కూడా ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడకుండా శశి ఎందుకు అడ్డుకున్నారన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతోంది. సెప్టంబరు 22న జయకు, శశికళకు మధ్య గొడవ ఏమైనా జరిగిందా? మరి ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు ఆమె గాయాలతో ఉన్నారా? అన్న ప్రశ్నలకు అపోలో వైద్యుల నుంచి సమాధానం రాలేదు. మరోవైపు శశి ప్రమాణస్వీకారం చేద్దామనుకున్న ఒక రోజు ముందు లండన్ నుంచి డాక్టర్ బాలేను చెన్నైకి రప్పించి జయ వైద్యంపై ప్రెస్ మీట్ పెట్టడంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద అన్నాడీఎంకే సీనియర్ నేత పాండ్యన్ చిన్నమ్మ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేశారనే చెప్పొచ్చు.

చిన్నమ్మపై రగులుతున్న అసంతృప్తి...

చిన్నమ్మ సీఎం అవుదామనుకున్న ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టేశారు. శాసనసభ పక్ష నేతగా ఎన్నిక కాగలిగారు. ఆరోజు నుంచే తమిళ ప్రజలు, సెలబ్రటీల నుంచి విమర్శలు, వ్యంగ్యోక్తులు శశి ఎదుర్కొంటున్నారు. దీంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో కూడా ఆలోచన బయలుదేరినట్లు చెబుతున్నారు. అమ్మ మరణంపై అనుమానాలను నివృత్తి చేయకుండా శశిని ముఖ్యమంత్రిని చేస్తే అందరికీ ప్రజల్లో చెడ్డపేరొస్తుందని వారు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. శశిపై ధ్వజమెత్తుతున్నారు. మొత్తం మీద గత ఏడాది సెప్టంబరు 22వ తేదీన పోయెస్ గార్డెన్ లో ఏం జరిగిందనేది మిస్టరీగానే మిగిలిపోనుందా? దీనిపై చిన్నమ్మ పెదవి విప్పుతారా? లేక దర్యాప్తు జరపాలని కోరతారా? ఇవన్నీ శశికళ చేతిలోనే ఉన్నాయి. జయ మృతిపై సందేహాలను పటాపంచలు చేయకుండా చిన్నమ్మ ముఖ్యమంత్రి అయినా... ప్రజల మనస్సుల్లో నుంచి ఆమె విలన్ గా నే మిగిలిపోతారన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

Similar News