సెటైర్ : తమరు క్యూలో ఉన్నారు.. కూసింత ఆగగలరు!

Update: 2016-11-07 16:24 GMT

అయబాబోయ్ సర్లెద్దూ.. మీ బోటి మహా మహా కొమ్ములు తిరిగిన మొనగాళ్లు చాలా మంది తయారయ్యారు ఈ పాటికే! పొద్దుగుంకే యేళకి మీరిట్టా తీరిగ్గా చుట్టంటించుకుంటూ వొచ్చి.. ఏదీ మాకూ రవ్వంత ఛాన్సియ్యి.. మేంగూడా ఖండించేస్తాం.. అంటూ చొరబడి పోవాలని అడిగితే ఎట్టాగ? ఎట్టా కుదురుద్ది? పొద్దున్నించి.. తెల్లారగట్లనే నిద్దర్లేచి.. పాపం పళ్లు కూడా తోమకుండా పాచినోటితోనే తిట్ల దండకాలు అప్పగింతలు ప్రారంభించేసి.. ఖండించేస్తూ తరించేస్తున్న మగానుబావులు చాలామందే ఉన్నారు మరి! ఆళ్లందరి వంతూ అయింతర్వాత గానీ.. తమరికి వంతు రాదు.. అప్పటిదాకా సేయడానికి ఏటుంటాది.. క్యూలైన్లో నించుని ఉండాల్సిందే.

అవును పాపం.. ఓట్ల కక్కుర్తితో ఉన్నాడో.. ఏదో చంద్రబాబును నాలుగు మాటలు ఆడిపోసుకుంటే.. వొచ్చే ఎలచ్చన్ల నాటికి నాలుగు ఓట్లు రాలతాయని ఆశపడతన్నాడో.. లేదా నిజంగానే హోదా లాంటిది తన మీటింగుల వల్ల సెంటరు కాణ్నించా లాక్కొచ్చేయవచ్చునని బ్రమ పడతన్నాడో మొత్తానికి జగన్ నిన్న యిసాపట్నంలో మీటింగెట్టి.. చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసాడు గాదా!

అంతటితో అయిపోలేదబ్బాయ్.. ఇయ్యాల పొద్దున్నే మొదలయింది జాతర! ఒక్క జగన్ తిట్టిందానికి జవాబుగా మంత్రులు దేవినేని ఉమా మహేస్వర్రావు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, యనమల రామక్రిష్ణుడు, ఇంకా ఎక్కడబడితే అక్కడ మరికొందరు మంత్రులు... సివరాకరికి లోకేష్ బాబు దాకా అందరూ తలోరీతిగా జగన్ ని చీల్చి చెండాడేసుకున్నారండీ బాబూ! అందుకే ఆ కోటాలో ఆయన్ని నాలుగు తిట్టి.. బాసు దృష్టిలో పడాలనే కోరిక ఎవురికైనా ఉంటే.. క్యూలో నిల్చోవాల్సిన పరిస్తితి వొచ్చింది మరి!

అయినా.. అంటే చోద్దెంగా ఉంటుంది గానీ.. చెంద్రబాబుని ఎవురెవురు ఎప్పుడు తిడతారా... అని ఈ బ్యాచీ అంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తా ఉండేట్టుగా ఉండేది. ఒక్కసారి జగన్ అలా తమలపాకుతో తానొకటి అనగానే.. తలుపు చెక్కతో వీళ్లంతా తగులుకుంటన్నారు. పాపం... జగన్ చంద్రబాబును తిట్టకుండా ఉంటే.. ఈ వందిమాగధ అమాత్య శేఖరులందరికీ.. పనీబాటా అంటూ ఏమైనా ఉంటుందో ఉండదో పాపం... అని నాబోటి దారినపోయే దానయ్య ముక్కుమీద యేలేసుకుంటే.. యిచిత్రం యేటుంటాది??

Similar News