సెక్రటేరియేట్ భవనాల్ని ఇచ్చేస్తే తప్పేంటి?

Update: 2016-10-31 01:48 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం పూర్తిస్థాయిలో అమరావతికి వెళ్లిపోయింది. ఏవో ఒకటీ అరా చిల్లర మల్లర ఆఫీసులు తప్ప.. ఏపీకి సంబంధించి హైదరాబాదులో ఏం లేవు. ప్రత్యేకించి సెక్రటేరియేట్ లో గతంలో ఏపీ కి కేటాయించిన బ్లాకులన్నీ పూర్తిగా ఖాళీ. ఈ నేపథ్యంలో ఏపీ కి కేటాయించిన సచివాలయ భవనాల్ని తెలంగాణ సర్కారుకు అప్పగించేయడం అనే అంశం మీద ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది. ఇవాళ అమరావతిలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబునాయుడు ప్రధానంగా ఈ విషయం గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంచుమించుగా భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించేయడానికి అనుకూలంగానే ఆయన నిర్ణయం తీసుకోవచ్చుననేది సమాచారం. తనలో ఇలాంటి ఆలోచన ఉన్నట్లుగా ఆయన ఇదివరకే సంకేతాలు ఇచ్చారు.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. చంద్రబాబునాయుడు సచివాలయ భవనాల్ని తెలంగాణకు అప్పగించేయడానికి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయం పట్ల విపక్షాలు విరుచుకు పడుతున్నాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు ఎలాంటి సామరస్యవైఖరి అనుసరించినా సరే.. ఓటుకు నోటు కేసులో నిందితుడు కావడం వల్ల, ఆ కేసు నుంచి క్షేమంగా బయటపడడం కోసం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటుంది. నిజానికి కృష్ణాజలాల పంపకాలకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ వద్ద జరిగిన సమావేశంలో వాదనలు వినిపించడంలో చంద్రబాబు లొంగిపోవడం అంటూ జరగలేదు. ఏపీ తో ముడిపడి ఉన్న సమస్యలు అలాగే అపరిష్కృతంగానే ఉండిపోయాయి. అలాంటి విషయాల్లో ఆయన తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తే నిందలు సబబే గానీ.. సచివాలయ భవనాల్ని తిరిగి ఇచ్చేస్తే తప్పేముంది అని పలువురు భావిస్తున్నారు.

పదేళ్ల పాటూ మనకు ఈ భవనాల మీద హక్కు ఉండవచ్చు గాక.. కానీ.. వెలగపూడి ఇంతకంటె ఆధునాతనమైన సచివాలయ భవనాల్ని చాలా వేగంగా నిర్మింపజేసి చంద్రబాబునాయుడు అక్కడికి మకాం మార్చారు. హైదరాబాదుతో ఉద్యోగులు, పరిపాలన, ఎడ్మినిస్ట్రేషన్ పరమైన అనుబంధాన్ని పూర్తిగా తెగిపోయింది. ఇక ఉత్తి పున్నేనికి భవనాలు పెట్టుకుని ఏం చేస్తారు? భవనాల్ని తెలంగాణ సర్కారుకు ఇచ్చేస్తే తప్పేం ఉంది.

అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. విభజన చట్టంలో 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకం ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాలేదు. ఆ పంపకం పూర్తయితే హైదరాబాదులోని చాలా ఆస్తులను కేసీఆర్, ఏపీ సర్కారుకు దఖలు పరచుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ ఆస్తులు తమ ప్రాంతంలో ఉన్నవి గనుక.. ఏపీకి ఇవ్వడం ఎందుకు లెమ్మన్నట్లుగా 9, 10 షెడ్యూళ్ల ఆస్తుల పంపకం అనే వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా నానుస్తూనే ఉన్నారు.

ఇప్పుడు సచివాలయం మాత్రం తమకు వెంటనే అప్పగించాలంటూ ఏపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన పదే పదే గవర్నర్ నరసింహన్ ను కలుస్తూ అటునుంచి నరుక్కు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నరసింహన్ ఇప్పటికే ఒకసారి చంద్రబాబు దీని గురించి మాట్లాడిన సంగతి కూడా తెలిసిందే.

సచివాలయం ఏపీ ఎప్పటికైనా తెలంగాణకు ఇవ్వాల్సిందే. అలాంటప్పుడు ఇప్పుడే ఇచ్చేయొచ్చు. కానీ దానికంటె ముందుగా చంద్రబాబు 9, 10 షెడ్యూళ్ల ఆస్తుల పంపకాలు తేల్చాలి. ఆ విషయాలు తేల్చకుండా చంద్రబాబు సచివాలయం ఇచ్చేయడానికి ఒప్పుకుంటే.. ఏపీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టినట్లే లెక్క. సోమవారం అమరావతిలో జరగనున్న కేబినెట్ భేటీలో కూడా 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకం తేలిన తర్వాతే.. సచివాలయం అప్పగింత అన్నట్లుగా తీర్మానించాలి. అలాకాకుండా.. చంద్రబాబు ఏకపక్షంగా సచివాలయ భవనాలు ఇచ్చేయడానికి తీర్మానం చేసేస్తే గనుక.. విపక్షాల ఆరోపణలు, ఓటుకు నోటు కేసు కారణంగా రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెడుతుండడం నిజమే అనుకోవాల్సి వస్తుంది.

Similar News