సుప్రీం ధర్మాగ్రహం కదలిక తెస్తుందా?

Update: 2016-10-27 02:30 GMT

శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపు- అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకరుకు ఎన్నిరోజుల సమయం అవసరం అవుతుంది. కేవలం ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే నిర్ణయం తీసేసుకుని.. వారిని పదవీచ్యుతులను చేసేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ... ఒకటి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తాజాగా మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో గడువు ఎంత కావాలో చెప్పాల్సిందేనంటూ సుప్రీం కోర్టు స్పీకరుకు తాకీదులు ఇవ్వడం సంచలనమే.

రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజ్యాంగ పరంగా ఉన్న లూప్ హోల్స్ ను వాడుకుని అధికార పార్టీలు విపక్షాల్లో ఉన్న ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా తమ పార్టీలో కలిపేసుకున్న వైనం అందరికీ తెలుసు. తెలంగాణలో కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో అధికార తెరాసలోకి ఫిరాయించారు. ఇక్కడ తెరాస మీద తెలుగుదేశం పార్టీ ఎంతగా గొంతు చించుకున్నదో అందరికీ తెలుసు గానీ.. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి.. అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు సాగిస్తున్న అద్భుతమైన పరిపాలనను చూసి ముచ్చటపడి వచ్చేస్తున్నారంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకిచెందిన పలువురు ఎమ్మెల్యేలను తమలో కలిపేసుకుంది.

అప్పటినుంచి ఈ ఫిరాయింపు అంశం మీద వివిధ దశల్లో న్యాయపోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. నిష్ఫలంగా సాగుతూనే ఉన్నాయి. కోర్టుల నుంచి వేర్వేరు సందర్భాల్లో ఆదేశాలు వస్తున్నాసరే.. వాటిని ఖాతరు చేసే దిక్కు కనిపించడం లేదు. తాజాగా తెకాంగ్రెస్ నడుపుతున్న ఈ కేసు సుప్రీంలో విచారణకు వచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లను ఎంత కాలంలోగా తేలుస్తారో తమకు చెప్పాలంటూ, ఆ విషయాన్ని నవంబరు 8వ తేదీలోగా చెప్పాలంటూ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది.

అయితే ఈ తీర్పు వలన ఎంత మేరకు ప్రయోజనం ఉంటుంది? ఎంత మేరకు అనర్హత వ్యవహారం కొలిక్కి వస్తుంది? అనేది మాత్రం చెప్పలేం అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోగలమో చెప్పలేం అంటూ స్పీకరు సమాధానం ఇచ్చినా.. దానిని కౌంటర్ చేయడానికి ఏ చట్టమూ లేదని.. అక్కడితో సమస్య మళ్లీ మొదటికి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News