సీకే బాబు సీన్ మర్చేస్తున్నారా?

Update: 2017-10-05 11:30 GMT

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇప్పుడు ఎటు వైపు చూస్తున్నారు. వైసీపీలోనే తాను ఉన్నానని చెబుతున్నా ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. సీకే బాబుతో తమ పార్టీకి సంబంధం లేదని వైసీపీ తెగేసి చెప్పింది. దీంతో సీకే బాబు రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ చిత్తూరు జిల్లాలో జరగుతుంది. సీకే ఎటువైపు వెళతారు? ఏదైనా పార్టీలోకి వెళతారా? లేక గతంలో మాదిరిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అన్నది సీకే అనుచరులకు కూడా అర్ధం కావడం లేదు. సీకే బాబు కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత వైసీపీకి మద్దతుదారుగానే ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి జంగాలపల్లి శ్రీనివాస్ కు మద్దతిచ్చారు. తనకు సీటు దక్కకపోయినా పెద్దగా ఫీలవ్వకుండా జంగాలపల్లి గెలుపు కోసం ప్రయత్నించారు. కాని అక్కడ టీడీపీ అభ్యర్ధి గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుని కొద్ది రోజులుగా సీకే బాబు మళ్లీ సీన్లోకి వచ్చారు. వైఎస్ వర్ధంతి సభను కూడా నిర్వహించారు.

స్వతంత్ర అభ్యర్థిగా.......

అయితే సీకేబాబుకు, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ ఛార్జి జంగాలపల్లి శ్రీనివాస్ మధ్య విభేదాలను తొలగించలేమని భావించిన వైసీపీ సీకే బాబునే దూరం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. సీకేబాబు ఇప్పటి వరకూ చిత్తూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందులో 1989లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. తర్వాత మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్ధిగానే విజయం సాధించారు. అయితే వైసీపీ నేతలు తనను పార్టీలోకి రానివ్వక పోవడంతో సీనియర్ నేత సీకే బాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ టిక్కెట్ దక్కకపోయినా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని సీకే బాబు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల నుంచి చిత్తూరు రాజకీయాలను తాను శాసిస్తుంటే తననే పక్కన పెడతారా? అన్న ఆగ్రహంతో సీకే బాబు ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పేట్లు లేదు. మరి త్రిముఖ పోటీ ఎవరికి లాభం? అన్నది తెలియాల్సి ఉంది.

Similar News