సింగపూర్ మంత్రి క్రేజ్ దిగజారిందేంటి చెప్మా?

Update: 2016-10-28 13:06 GMT

సింగపూర్ అంటేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి పూనకం వచ్చేస్తుంది. సింగపూర్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ ఏపీ రాజధానిని నిర్మించడానికి కృషి జరుగుతోందని చెబుతూ ఉంటారు. సింగపూర్ ఓ అద్భుత దేశం అంటూ చంద్రబాబు సదా కీర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే.. సింగపూర్ ప్రభుత్వంలోని మంత్రి షణ్ముగం గతంలో ఎప్పుడు భారత్‌కు వచ్చినా ఆయనకు అంగరంగ వైభవమైన ఏర్పాట్లు జరిగేవి. ఆయన పర్యటనకు సంబంధించిన సకల వ్యవహారాలను స్వయంగా చంద్రబాబునాయుడే చూసుకునే వారు!

కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సింగపూర్ మంత్రి షణ్ముగం తిరుమలేశుని దర్శనానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన రాక గురించి పట్టించుకున్న దిక్కు లేదు. కనీసం ప్రభుత్వ లేదా చంద్రబాబు ప్రతినిధిగా తిరుపతిలోనే నిత్యం ఉండే టీటీడీ ఛైర్మన్ కూడా షణ్ముగం ఏర్పాట్ల సంగతి చూడలేదు. సాధారణ ప్రోటోకాల్ ప్రకారం.. తిరుమల జేఈవో ఆయనకు దర్శనం ఏర్పాట్లు గట్రా చేశారు.

అయితే షణ్ముగానికి జరిగిన ఈ ఏర్పాట్లను గమనిస్తున్న వారికి రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. గతంలో చంద్రబాబు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి.. పదేపదే షణ్ముగంతో సమావేశం అవుతూ వచ్చారు. అమరావతి నిర్మాణానికి అద్భుతంగా సహకరిస్తున్నారు అంటూ పదే పదే ఆయనను నెత్తికెత్తుకుంటూ వచ్చారు. ఏమైందో తెలియదు. ఇప్పుడు చంద్రబాబు షణ్ముగం ఊసెత్తడం మానేసి చాలాకాలం అయింది. తీరా ఆయన తిరుమలకు వచ్చినా.. ప్రభుత్వం తరఫున రిసీవ్ చేసుకుని మర్యాదలు చేసిన దిక్కులేదు.. షణ్ముగం ద్వారా చంద్రబాబు ఆశించిన ప్రభుత్వ కాంట్రాక్టు వ్యవహారాలు ఏమైనా బెడిసికొట్టాయేమో అని జనం అనుమానిస్తే తప్పేముంది.

Similar News