సామాన్యుల డిజిటల్ జీవితానికి తెరతీస్తున్న చంద్రబాబు

Update: 2016-11-18 21:46 GMT

ఇప్పుడు నోట్ల రద్దు కారణంగా సామాన్యులకు ఎదురవుతున్న ప్రధానమైన సమస్య రోజువారీ ఖర్చుల కోసం చేతిలో ‘చెల్లుబాటు అయ్యే’ నగదు లేకపోవడం. అవసరాలకు తగినంత కొత్త నోట్లు లభ్యత లేకపోవడం. ఆ సమస్య తీరితే.. వారిక కష్టాల గురించి మాట్లాడే పరిస్థితే ఉండదు. అయితే డబ్బు ఖర్చు చేయడంలో నగదు రూపేణా కాకుండా, ఇతర ఆధునిక డిజిటల్ రూపాల్లో ఖర్చు అనేది ఇప్పటిదాకా కనీసం దేశంలో 5 శాతం మందికి కూడా అలవాటు అయిన వ్యవహారం కాదంటే అతిశయోక్తి కాదు. ఆ నేపథ్యంలో ఏపీలో గ్రామాల్లోని సామాన్యలకు కూడా డిజిటల్ లావాదేవీలు సులువుగా జరిగే పద్ధతులను, తద్వారా వారి వ్యవహారాల్లో పారదర్శకతను పెంచే ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు చేస్తున్నారు.

స్వైపింగ్ మెషిన్లను ప్రతి చిన్న కిరాణా కొట్లలో కూడా ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబునాయుడు సూచిస్తున్నారు. స్వైపింగ్ మెషిన్లను పెద్ద సంఖ్యలో సరఫరా చేయాలని, స్వైప్ చేసే క్రయవిక్రయాల మీద విధించే పన్నులను రద్దు చేయాలని, ఆన్ లైన్ లో జరిగే అన్ని రకాల లావాదేవీల మీద విధిస్తున్న పన్నులను, రుసుములను కూడా రద్దు చేయాలని , దీనివలన ప్రజల్లో ఆ సదుపాయాలను వాడుకునే అలవాటు పెరుగుతుందని చంద్రబాబునాయుడు అంటున్నారు.

ఏపీలో జిల్లా కలెక్టర్లు అందరికీ ఇలాంటి కొత్త పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తీసుకురావడం గురించి ఆయన రెగ్యులర్ గా పట్టించుకుంటున్నారు. రేషన్ దుకాణాలను చిన్న స్థాయి కిరాణా కొట్లలాగా మార్చి.. మొత్తం డిజిటల్ చెల్లింపుల విధానంలోకి తీసుకెళ్లే ఆలోచన కూడా ఇలాంటిదే. అసలే హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబునాయుడు.. ఈ నోట్ల రద్దు కష్టాల నివారణకు తీసుకుంటున్న చర్యలతో, రాష్ట్రమంతా కూడా డిజిటల్ మనీ వినియోగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరించినా ఆశ్చర్యం లేదనేలా పరిస్థితి కనిపిస్తోంది.

Similar News