సన్నాహాలు సకలం సిద్ధం : కొత్త జిల్లాలతో కొంగొత్త పాలన!

Update: 2016-10-11 00:31 GMT

‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరిత గల తల్లీ నీరాజనం

పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!’’

ప్రతి ఉదయం ప్రతి పాఠశాలలోను యావత్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ , తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని , భవిష్యత్ ఆశా దీప్తిని ప్రతిబింబించే పాట ఇది. ఈ పాటను మనం ఇప్పుడు కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ’పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన ‘ అనే పాదం స్థానంలో ’31 జిల్లల నీ పిల్లలు స్వప్నించే భవితవ్యం’’ అంటూ ఆ పాదాన్ని మార్చి రాసుకోవాలి. అవును తెలంగాణలో ఇవాళ్టినుంచి 31 జిల్లాలు కార్యరూపంలోకి రానున్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు అనే వ్యవహారాన్ని కేసీఆర్ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బంగారు తెలంగాణ సాధన అనే స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా.. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అనే చర్య చాలా పెద్ద ముందడుగు అవుతుందని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కొత్త ఏర్పాటు ప్రకారం 31 జిల్లాల్లో కొత్తగా 25 రెవిన్యూ డివిజన్లు, 125 మండలాలు రానున్నాయి. జిల్లాలు ప్రారంభం కావడానికి ప్రభుత్వం సకల సన్నాహాలను పూర్తి చేసింది. అన్ని జిల్లాలకు జిలా స్థాయి ఉన్నతాధికారులను కేటాయిస్తూ సోమవారం సాయంత్రమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 31 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, కొత్త ఎస్పీలు, కొత్త డీఈవోలు ఇలా కొత్త అధికార వర్గం కొలువు దీరడానికి ఆదేశాలు వచ్చాయి.

కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటును ప్రజలు వేడుకగా జరుపుకోవాలని, ప్రభుత్వ వేడుకల్లో పాల్గొనాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. పరిపాలన మెరుగు అవుతుందని అభిప్రాయపడుతున్నది. కొత్త జిల్లాలను ప్రతి చోటా ఘనమైన వేడుకలతో ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్‌రావుతో కలిసి సిద్ధిపేట జిల్లాను తొలుత అధికారికంగా ప్రారంభిస్తారు. తర్వాత మిగిలిన అన్నిజిల్లాలను ప్రారంభించే బాధ్యతను మంత్రులకు, కొందరు సీనియర్ అధికార్లకు అప్పగించారు. ప్రతిచోటా ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. విజయదశమి పర్వదినం గనుక ఈ రోజునుంచే అధికారిక కార్యక్రమాలు మొదలయ్యేలా సెలవులను కూడా రద్దు చేశారు.

మొత్తానికి కొత్త జిల్లాల రూపేణా కొత్త రూపు సంతరించుకున్న తెలంగాణ.. బంగారు భవిష్యత్తు దిశగా కొంగ్రొత్త ప్రస్థానం సాగించబోతున్నది. ఆ లక్ష్యసాధనకు ఈ చిన్న అధికార వికేంద్రీకరణ అనే ఏర్పాటు ఒక మంచి ఆధరవు కావాలని అభిలషిస్తూ.. ‘తెలుగుపోస్ట్ డాట్ కాం’ కొత్తజిల్లాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.

Similar News