సత్తిబాబు స్పందించకుంటే బాగుండేది

Update: 2016-10-09 01:16 GMT

నారా లోకేష్.. ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్పను తీవ్రంగా దూషించారంటూ ఓ ఫోటో ఆధారంగా అల్లిన కథ వివాదంలో వైకాపా నాయకులే ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఫోటో చుట్టూ అల్లిన కథ.. ఇప్పుడు తమ పార్టీ పరువు తీసిందని వారు ఆందోళన చెందుతున్నారు. పార్టీ పరంగా స్పందించకుండా.. సోషల్ మీడియాలో అలా చెలామణీ చేసేంత వరకు మాత్రమే తమ పాత్ర పరిమితం అయి ఉంటే బాగుండేదని.. కానీ పార్టీ ఆ వ్యవహారాన్ని నెత్తికెత్తుకోవడం వల్ల ఇప్పుడు సెల్ప్ గోల్ అయిందని కుమిలిపోతున్నారు.

నిజానికి పార్టీ సమావేశంలో అంతర్గత చర్చ జరుగుతున్నప్పుడు లోకేష్ వేదిక మీద ఉండగా, చర్చలో పాల్గంటూ చిన రాజప్ప లేచి నిల్చుని తన అభిప్రాయం చెప్పినప్పటి ఫోటో అది. ఆ ఫోటో లీక్ కాగానే.. చినబాబు.. చిన రాజప్పను నానా మాటలు తిట్టేశాడని, చినరాజప్ప కన్నీళ్లు పెట్టుకున్నాడని కట్టు కథలు అల్లారు. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారు. అంతవరకు పరిమితమైపోయి ఉంటే వైకాపాకు పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు.

చిన రాజప్ప కాపు వర్గానికి చెందిన నేత అయ్యేసరికి.. తాము పార్టీ పరంగా దాన్ని భుజానికెత్తుకుంటే చంద్రబాబు మీద బురద చల్లవచ్చునని వారికి ఆలోచన వచ్చింది. కాపునేత గనుక.. చినరాజప్ప ను ఇలా లోకేష్ తిట్టారంటూ.. కేవలం ఒక ఫోటో ఆధారం చేసుకుని బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి మరీ నానా విమర్శలు చేసేశారు. లోకేష్ ను చూసి చినరాజప్ప వణికి పోయారని కూడా చెప్పేశారు. వీడియో కాకుండా.. ఫోటోలో వణికిపోవడం ఆయనకు ఎలా కనిపించిందో తెలియదు. తీరా లోకేష్ ఆ చర్చ మొత్తానికి సంబంధించిన వీడియో విడుదల చేసి, ఓ బహిరంగ లేఖ రాసి విమర్శకుల నోర్లు మూయించారు.

కాకపోతే ఇప్పుడు వైకాపా వారి మధనం ఏంటంటే.. ఆ పుకారును సోషల్ మీడియా వరకు పరిమితం చేసి ఉంటే పోయేదని, కులం రంగు పులిమే అత్యుత్సాహంలో బొత్స ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆడిపోసుకోవడం వల్ల తమకు అంటుకున్నదని అంటున్నారు. ఇలాంటి వాటివల్ల తమ విమర్శలు క్రెడిబిలిటీ పోతుందని జంకుతున్నారు.

Similar News