సందేహంలో సంకేతం : హింస చోటు చేసుకుంటుందా?

Update: 2016-11-19 07:07 GMT

ప్రజా ఉద్యమాలను హింసాత్మక ఉద్యమాలుగా మార్చేసి.. తద్వారా రాజకీయ లబ్ది పొందడం అలవాటు అయిన చాలా పార్టీలు ఇప్పుడు నోట్ల రద్దు అనే అంశాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రజల్లో అంత తీవ్రంగా లేని వ్యతిరేకతను, తమ రాజకీయ ప్రసంగాలు, మీడియా ప్రసంగాల్లోనే వెల్లువెత్తిస్తున్న రాజకీయ పక్షాలకు తాజాగా ఓ కొత్త ‘లీడ్’ అందినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోరాటాన్ని ఉధృతం చేస్తాం అని అంటున్నవారు.. ఈ పోరాటాన్ని హింసాత్మక ఘటనల వైపు మళ్లించే ప్రమాదం ఉందా.. అనే ఆలోచన పలువురిలో తలెత్తుతోంది. ప్రజలు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. వారి ఆందోళన హింసవైపు మళ్లవచ్చునని సుప్రీం ధర్మాసనం వ్యక్తంచేసిన సందేహమే.. కొందరికి సంకేతాలుగా పనిచేయవచ్చునని పలువురు భావిస్తున్నారు.

నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ.. పలువురు ప్రెవేటు వ్యక్తులు, న్యాయవాదులు, పార్టీలు దాఖలు చేస్తున్న పిటిషన్లను సుప్రీం కోర్టులో తప్ప కింది కోర్టుల్లో విచారించకుండా ఆదేశించాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు వాటి గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కును కాదనలేం అంటూ తీర్పు చెప్పింది.

అయితే ఇదే సమయంలో సుప్రీం ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఆందోళన కలిగించేవి. ఈ పరిస్థితి హింసాత్మక సంఘటనలకు దారితీయవచ్చునని పేర్కొంది. అయితే వాస్తవం ఎలా ఉన్నదంటే.. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనేకానేక చర్యలు ఉపశమనం కలిగిస్తున్నాయి. కష్టాలు తీవ్రంగా ఉన్న రోజుల్లోనే ప్రజలు హింసవైపు మళ్లకుండా ప్రభుత్వ సంకల్పాన్ని అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కష్టాలు తగ్గినా సరే.. రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్న సంక్లిష్టత నేపథ్యంలో.. సుప్రీం సందేహాలనుంచి సంకేతాలు అందుకుని ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరగవచ్చునేమో అనే భయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇప్పటి సహకారాన్ని ఇలాగే కొనసాగిస్తే కొన్ని రోజుల్లో పూర్తి సాధారణ పరిస్థితి కాకపోయినా... ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని భావిస్తున్నారు.

Similar News