శెభాష్ జగన్ : సక్రమంగా వాడితే మంచి ఆలోచన!

Update: 2016-11-01 13:24 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి శెభాషనదగిన ఒక నిర్ణయం తీసుకున్నారు. విపక్షానికి చెందినప్పటికీ.. ప్రజాప్రతినిధులుగా తాము ఎలాంటి బాధ్యతను నిర్వర్తించాలని ప్రజలు కోరుకుంటారో అలాంటి నిర్ణయానికి జగన్ వచ్చారు. తన పార్టీకి చెందిన 47 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ తీసుకుని ప్రజా సమస్యలను నివేదించాలని అనుకుంటున్నారు. భేషజాలను పక్కన పెట్టి ప్రజాసమస్యల పరమావధే ముఖ్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించాలి.

గత రెండున్నరేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ప్రధానంగా స్థూలంగా ఉండే అంశాల మీదే జరిగాయి. ప్రత్యేక హోదా, రైతు దీక్ష, రుణమాఫీ కోసం పోరాటాలు ఇలా సాగాయి. అయితే తనను నమ్మి తన పార్టీ అభ్యర్థులను గెలిపించిన నియోజకవర్గాల్లో జనం కోసం , అక్కడి స్థానిక సమస్యల కోసం పెద్దగా పాటుపడింది లేదు. సాధారణంగానే.. స్థానికంగా ఉండే ప్రజాసమస్యలను పరిష్కరించడంలో విపక్ష ఎమ్మెల్యేలకు కాస్త ఇబ్బందులే ఎదురవుతుంటాయి. విపక్ష ఎమ్మెల్యేలు ఉండే నియోజకవర్గాల్లో పాలకపక్షాలు తమ పార్టీ ఇన్ చార్జిల హవా నడిపిస్తూ ఉంటారు. ఈ రకమైన చర్యల ద్వారా విపక్షాలు గెలిచిన చోట తమ పార్టీ ప్రాభవం పెంచుకునే ప్రయత్నాల్లో చంద్రబాబుది అందె వేసిన చేయి.

అలాంటి నేపథ్యంలో తమను నమ్మి గెలిపించిన నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు అన్నీ పెండింగ్ పడిపోవడం పార్టీకి నష్టం అని జగన్ గుర్తించినట్లుంది. మొత్తానికి నియోజకవర్గాల వారీ సమస్యలను ప్రధానంగా తీసుకుంటూ సీఎం వద్దకు వెళ్లాలని యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది జగన్ కు ద్విముఖ వ్యూహంగా ఉపయోగపడుతుంది. తమ డెలిగేషన్ ఫలించి.. చంద్రబాబు తాము ప్రస్తావించిన సమస్యలను పట్టించుకుంటే.. తాము సాధించినట్లు చెప్పుకోవచ్చు. పట్టించుకోకపోతే.. తమ నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యల పట్ల చంద్రబాబు కక్షసాధింపు ధోరణితో ఉన్నారని ఆరోపణలు చేయవచ్చు.

జగన్ కు అంత భయమెందుకు?

అయితే ఇక్కడొక ట్విస్టు ఉంది. ఒకేసారి 47 మంది ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గాల సమస్యలను నివేదించాలంటే.. ఒక పూర్తిరోజు సమయం కేటాయించినా సరిపోదు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఒక్కరే వెళ్లి.. తమ ప్రాంత సమస్యలన్నీ చెప్పుకుని వస్తారు. తమ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలను కూడా అలా విడివిడిగా సీఎం వద్దకు పంపాలని జగన్ అనుకున్నారట. అదే సమయంలో.. ఒంటరిగా తమ ఎమ్మెల్యేలు వెళితే.. చంద్రబాబు బేరాలు పెట్టి తెదేపాలో చేర్చేసుకుంటారేమో అని భయపడి.. అందరినీ జట్టుగా ఒకేసారి తీసుకువెళ్లాలని అనుకున్నారట. అయితే ఇంత పెద్ద బృందాన్ని ఒకేసారి తీసుకువెళ్లడం వల్ల సీఎం కేటాయించే సమయంలో అసలు సమస్యల మీద ఫోకస్ తగ్గకుండా జగన్ జాగ్రత్తలు తీసుకోవాలి.

Similar News