శశి ‘కళ’ తప్పిన పోయెస్ గార్డెన్...?

Update: 2017-02-14 15:30 GMT

పోయెస్ గార్డెన్ వెలవెల బోతోంది. మరికొద్దిసేపట్లో పోలీసులు శశికళను అరెస్ట్ చేయనున్నారు. గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు. శశికళను తక్షణమే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసుల శశికళను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. శశికళను బెంగుళూరు జైలుకు తరలించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి వచ్చిన తర్వాత గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళతో భేటీ అయ్యారు. గవర్నర్ తో జరిగిన సంభాషణను ఆమెకు వివరించినట్లు తెలుస్తోంది.

వైభవం పోయిందే...

మరోవైపు చిన్నమ్మకు గత 35 ఏళ్లుగా జరిగిన వైభవం క్రమంగా తొలిగిపోతోంది. శశికళ వ్యక్తిగత భద్రత సిబ్బందిని ప్రభుత్వం తొలిగించింది. పోయెస్ గార్డెన్ లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతను వెనక్కు తీసుకున్నారు. దీంతో పోయెస్ గార్డెన్ జనసంచారం లేక వెలవెల బోతోంది. శశికళను గోల్డెన్ బే రిసార్ట్ నుంచి నేరుగా జైలుగా తరలించే ఏర్పాటు చేయడంతో ఇక పోయెస్ గార్డెన్ కు వెళ్లలేరు. మహిళా పోలీసులను అధిక సంఖ్యలో నియమించారు. అయితే గవర్నర్ పళని స్వామిని ఆహ్వానిస్తారా? లేక పన్నీర్ కు అవకాశమిస్తారా? అనేది తెలియకుండా ఉంది. పన్నీర్ కూడా గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పళనిస్వామికే ఉండటంతో పన్నీర్ ను పిలిచే అవకాశాలు తక్కువేనంటున్నారు నిపుణులు.

పన్నీర్ కు కన్నీరేనా?

చిన్నమ్మను ఎదిరించి వేరుకుంపటి పెట్టుకున్న పన్నీర్ సెల్వం ఇప్పుడు ఏం సాధించబోతున్నారు? తమిళనాడు గవర్నర్ పళనిస్వామిని ఆహ్వానిస్తే పన్నీర్ పని అయిపోయినట్లేనని అంటున్నారు. అన్నాడీఎంకేలో చీలికను తెచ్చిన పన్నీర్ ఒంటరిగానే మిగిలిపోతారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తనకు కనీస మద్దతు లేకపోయినా పన్నీర్ ఎందుకంత దూకుడు ప్రదర్శించారో విశ్లేషకులకు సైతం అంతుపట్టకుండా ఉంది. కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలతో సీఎం కుర్చీని ఎక్కుదామనుకున్న పన్నీర్ కు చిన్నమ్మ గట్టి షాకే ఇచ్చారు. చివరి నిమిషంలో పళని స్వామిని నియమించడం ద్వారా పన్నీర్ ఎత్తుగడలకు చెక్ పెట్టారు. పన్నీర్ ప్రాధమిక సభ్యతం కూడా రద్దు చేశారు. పన్నీర్ వెంట ఉండే ఎంపీలపైనా సస్పెన్షన్ వేటు వేశారు. పళనిస్వామి పేరు బయటకొచ్చాక ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు వస్తారా? రారా? అన్నదే తేలడం లేదు. ఇప్పుడు గవర్నర్ ను పన్నీర్ కలిసినా...బలనిరూపణకు అవకాశమివ్వకపోవచ్చంటున్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఊహించని మలుపులూ తిరగొచ్చు. ఆ అవకాశం కోసమే పన్నీర్ ఇంకా వెయిట్ చేస్తున్నారా? అనిపిస్తోంది. శశికళ వర్గం మాత్రం తమకు 123 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ఘంటాపధంగా చెబుతున్నారు. ఒకవేళ అదేనిజమైతే పన్నీర్ కు కన్నీరే మిగులుతుంది.

Similar News