వ్యక్తుల లబ్ధికి సిద్ధం.. సంస్థల లబ్ధికి నో!

Update: 2016-10-29 06:52 GMT

ప్రత్యేకహోదా కు మించిన ప్యాకేజీ ఇచ్చాం.. హోదాను మించిన అభివృద్ధి జరుగుతుంది... అంటూ భాజపా, తెదేపా నాయకులు పదేపదే ఊదరగొడుతున్నా సరే... ఇంకా జగన్, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు హోదా గురించి పట్టుబడుతుండడంలో ఉన్న వ్యత్యాసం ఒక్కటే. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు పన్ను రాయితీలు వస్తాయి. ఈ రాయితీలు కొత్త పరిశ్రమలు స్థిరపడడానికి చాలా కీలకం అవుతాయి. ఆ నేపథ్యంలో పరిశ్రమలు ఎగబడి ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వారు.. ఇంకా, హోదాను అడుగుతున్నారు. అయితే పరిశ్రమలు స్థిరపడడానికి అవసరమైన అలాంటి పన్ను రాయితీలను ఇవ్వడానికి మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రి సుముఖంగా లేరు. ఆయనకు ఇష్టం లేదు. యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఇవ్వగల సంస్థలకు రాయితీలు ఇవ్వడానికి మీన మేషాలు లెక్కించే జైట్లీ, అదే సమయంలో వ్యక్తులకు మాత్రం లబ్ధి చేయడానికి సుముఖంగా ఉండడం విశేషం.

అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు , సమీకరణలో భాగంగా జరిగిన ఆర్థిక లావాదేవీలకు క్యాపిటల్ గెయిన్స్ పన్నులేకుండా మినహాయించాలంటూ రైతులు జైట్లీని కోరారు.

దీనికి జైట్లీ అనుకూలంగా స్పందించి వచ్చే బడ్జెట్ లో పెడతామని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. రైతుల అప్పీల్ ను ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తానికి రైతుల త్యాగాలను (?) అభినందించిన మంత్రి వారికి పన్ను మినహాయింపులు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.

అయితే శోచనీయం ఏంటంటే.. అమరావతి ప్రాంత రైతులు సేద్యం చేసుకుంటూ ఉన్న పొలాలను ఇచ్చి ఉండవచ్చు గాక.. కానీ, అందుకు గానూ వారు పొందుతున్న ప్రతిఫలం.. మామూలుగా ఆ ప్రాంతంలో ఉన్న ధరలకంటె చాలా ఎక్కువ. అయితే వారు ప్రస్తుతం ఆ సొమ్ముకు కూడా పన్ను రాయితీలు అడుగుతున్నారు. ఇలా వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి జైట్లీ ఒప్పుకుంటున్నారే గానీ.. పరిశ్రమలు స్థాపించే వారికి పన్ను రాయితీలు ఇస్తే ఈ ప్రాంతంలో పదిమందికి ఉద్యోగాలు వస్తాయి.. రాష్ట్రం బాగుపడుతుంది అంటే ఆ రాయితీ ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు. రైతుల గురించి మాత్రం వాయిస్ వినిపిస్తున్న గల్లా జయదేవ్ లాంటి ఎంపీలు.. పరిశ్రమలకు కూడా ఇలాంటి రాయితీలు రాబట్టడంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో తెలియదు.

Similar News