వైసీపీలో అన్నీ మారుతున్నాయా?

Update: 2017-11-08 14:30 GMT

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల వేళ రాజకీయం ఊపందుకుంది. ఎన్నికల్లో పోటీకి దీటైన అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్ఠానం రాజ‌కీయంతో ప్ర‌కాశం జిల్లా వైసీపీ రాజ‌కీయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు జ‌గ‌న్ బాబాయ్ వైవి.సుబ్బారెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ టిక్కెట్ రాద‌ని ప్ర‌చారం ఊపందుకుంది. ఆయ‌న్ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే వాడుకోవాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తుంటే వైవి మాత్రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే వైవి కోరిక ఎంత వ‌ర‌కు నెర‌వేరుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఒంగోలుకు బాలినేని బైబై.. .

ఇక జిల్లా వైసీపీని త‌న కనుసైగ‌ల‌తో శాసించే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఒంగోలులో పోటీ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర‌త్రా అంశాల నేప‌థ్యం, వైవి ప‌దే ప‌దే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెడుతుండ‌డంతో బాలినేని వ‌చ్చే ఎన్నిక‌ల్లో మార్కాపురం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు జిల్లాలో ఒక్క‌టే వార్త‌లు చ‌క్కెర్లు కొడుతున్నాయి. ఇందుకు ఊత‌మిచ్చేలా ఇటీవ‌ల బాలినేని మార్కాపురంపై లైట్‌గా కాన్‌సంట్రేష‌న్ పెంచుతున్నారు. బాలినేని మార్కాపురంలో పోటీ చేస్తే అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంక‌ట‌రెడ్డిని త‌ప్పించాల్సి ఉంటుంది.

ద‌ర్శిలో మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు...

జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన ద‌ర్శిలో బూచేప‌ల్లి ఫ్యామిలీ స‌భ్యులు పోటీ చేయ‌మ‌ని చేతులు ఎత్తేయ‌డంతో ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు మౌమితా ఫౌండేషన్‌ అధ్యక్షుడు బాదం మాధవరెడ్డి పోటీలో ముందున్నట్లు తెలుస్తోంది. మ‌రో టాక్ ఏంటంటే బూచేపల్లి ఫ్యామిలీ టీడీపీలో చేరి మార్కాపురం నుంచి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ట‌. ద‌ర్శిలో ఇలా ఉంటే సంత‌నూత‌ల‌పాడు బాధ్య‌త‌ల‌ను గ‌త ఎన్నిక‌ల్లో చిత్తూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సామాన్య కిర‌ణ్‌కు అప్ప‌గించారు. ఇక్క‌డ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే సురేష్‌కు య‌ర్ర‌గొండ‌పాలెం బాధ్య‌త‌లు ఇచ్చేశారు.

గిద్దలూరు పిడతలకేనా?

ఇక గిద్ద‌లూరులో నిన్న‌టి వ‌ర‌కు బాధ్య‌త‌లు చూస్తోన్న ఐవి.రెడ్డికి షాక్ త‌ప్పేలా లేదు. తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని ముందుకు వచ్చిన మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయికల్పనారెడ్డితో అధిష్ఠానం చర్చలు జరపడంతో ఐవి.రెడ్డికి షాక్ త‌ప్ప‌దంటున్నారు. ఇక కందుకూరులో మాజీ మంత్రి మ‌హీధ‌ర్‌రెడ్డిని పార్టీలోకి తీసుకుని బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని వైసీపీ అధిష్టానం చూస్తున్నా, ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న దివి శివ‌రాం కూడా వైసీపీలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప‌ర్చూరు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన భ‌ర‌త్‌నే కంటిన్యూ చేయొచ్చు. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా ఉన్న ఈ స‌మీక‌ర‌ణ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఎలా మార‌తాయో ? చూడాలి.

Similar News