వైకాపా ఒక లక్ష్యం ఓకే, అసలు లక్ష్యం తీరేనా?

Update: 2016-10-25 04:51 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడడంలో తీవ్రతను పెంచింది. ఇప్పటికే యువభేరీ ల పేరిట రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో విద్యార్థులు యువతను పోగేసి.. హోదా వలన కలిగే లాభాల గురించి వారిలో చైతన్యం కలిగించడానికి జగన్మోహన రెడ్డి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దానితో పాటూ ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా పార్టీ ప్లాన్ చేసింది. ఈ రకంగా ద్విముఖ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటోంది.

యువభేరీ కార్యక్రమాలకు విద్యార్థి వర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఎంతగా సక్సెస్ అవుతున్నా.. పార్టీకి రావాల్సినంత కీర్తి రావడం లేదని వారు భావిస్తున్నారు. దాంతో పెద్దఎత్తున బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. తొలిసభ నవంబరు 6న విశాఖలో జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 5 చోట్ల సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

రాష్ట్రప్రభుత్వ పరిపాలన విషయంలో జగన్ అండ్ కో ఎలాంటి విమర్శలు చేసినా.. చంద్రబాబు కోటరీ ఏదో ఒక సమాధానం చెప్పేస్తుంటారు. ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించినప్పుడు మాత్రం వారికి నోట మాట పడిపోతుంది. ప్రత్యేక హోదా విషయంలో వారి వైఫల్యం వారికి కూడా స్పష్టంగా తెలిసిందే గనుక.. ఏమీ మాట్లాడకపోవడం జరుగుతోంది. పైగా పదేపదే ప్యాకేజీ గొప్పదని అంటూ ఉంటే అది తమ పార్టీకే చేటు చేస్తుందని కూడా తెదేపా నాయకుల్లో ఒక భయం ఉంది. సరిగ్గా ఆ పాయింటు దగ్గర బలహీనతనే వైకాపా సొమ్ము చేసుకోవాలనుకుంటోంది. ఆ బలహీనత మీదనే తీవ్రస్థాయిలో దాడి చేయాలని అనుకుంటోంది. తమ పార్టీ తరఫున ప్రత్యేక హోదా పోరాటాన్ని ముమ్మరం చేయాలని భావిస్తోంది.

తమ పోరాటం ఖచ్చితంగా పాలకపక్షాన్ని ఇరుకున పెడుతుందనే నమ్మకం వారికి ఉంది. తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టడం వరకూ వారి లక్ష్యం నెరవేరవచ్చునేమో గానీ.. అచ్చంగా.. హోదా సాధించడం అనేది వారికి సాధ్యమవుతుందా అనేదిమాత్రం అనుమానమే.

Similar News