వైఎస్ కు, జగన్ పాదయాత్రలకు మీడియా కవరేజీలో ఎంత తేడా?

Update: 2017-11-07 12:30 GMT

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌న్నీ షాకిచ్చినట్టే క‌నిపిస్తున్నాయి. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఆరు నెల‌ల పాటు పాద‌యాత్ర చేయ‌బోతున్నారు. అయితే ఈ 'ప్ర‌జా సంక‌ల్ప యాత్ర' పై ముందు నుంచీ అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. యాత్ర‌కు ముందుగానే మీడియా సంస్థ‌ల అధినేత‌ల‌ను క‌లిసి త‌న పాద‌యాత్ర‌కు స‌ముచిత స్థానం ఇవ్వాల‌ని కోరిన నేప‌థ్యంలో.. అవ‌న్నీ ఎలా వ్య‌వ‌హరిస్తాయి? ఎంత వ‌ర‌కూ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను క‌వ‌ర్ చేస్తాయ‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. అంతేగాక మీడియా మొఘ‌ల్, ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీ రావును ప్రత్యేకంగా భేటీ అయిన నేప‌థ్యంలోనూ అంద‌రిలోనూ మ‌రింత ఆస‌క్తి పెరిగింది. అయితే కొన్ని సంస్థ‌లు మిన‌హా.. రామోజీరావుతోపాటు ఇతర సంస్థ‌లు కూడా దాదాపు జ‌గన్‌కు హ్యాండిచ్చాయ‌ని తెలుస్తోంది!!

మీడియా అధిపతులతో భేటీ....

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టానికి విప‌క్ష‌నేత జ‌గ‌న్‌ శ్రీకారం చుట్టారు. దీనికి ముందు ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తు అంతా ఇంతా కాదు. గుళ్లూ, గోపురాలూ, స్వాములూ.. ఆశీర్వాదాలు.. పూజ‌లు ఇలా దేవుడిపై కొంత భారం వేశారు. త‌ర్వాత త‌న వంతు ప్ర‌య‌త్నంగా మ‌రికొన్ని చేశారు. అందులో కీల‌క‌మైన‌ది మీడియా అధినేత‌ల‌తో భేటీ కావ‌డం. 2019 ఎన్నిక‌లు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారిన నేప‌థ్యంలో మీడియా విష‌యంలో ఒక మెట్టు దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగా మీడియా సంస్థ‌ల అధిప‌తుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ప్రారంభ‌మైన ఆయ‌న పాద‌యాత్ర విష‌యంలో మీడియా పోషించ‌బోతున్న పాత్ర ఎలా ఉంటుంద‌నేది అంద‌రిలో ఆస‌క్తి రేపింది.

వైఎస్ కు మంచి కవరేజీ.....

గ‌తంలో వైఎస్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు అదీ ఇది అని తేడా లేకుండా అందుబాటులో ఉన్న మీడియా అంతా మంచి క‌వ‌రేజ్ ఇచ్చింది. అప్ప‌టికి ఇప్ప‌టికి ప‌రిస్థితులు చాలా మారిపోయాయి. అదే విధంగా వాటిపై అధికార పార్టీ ప్రాబ‌ల్యం కూడా బాగా పెరిగింది. అయితే న‌మ్ముకున్న సంస్థ‌ల‌న్నీ జ‌గ‌న్‌కు నిరాశ‌ను క‌లిగించాయి. యాత్ర ప్రారంభానికి ముందు టీవీ 9 బాగా క‌వ‌ర్ చేసింది. ముంద‌స్తు ఏర్పాట్లు, చోటా మోటా నాయ‌కుల ప్ర‌సంగాలు వంటివి ప‌దే ప‌దే చూపింది. విప‌క్ష‌నేత తొలి అడుగు ప‌డిన త‌ర్వాత ఈ ఛానెల్ క‌వ‌రేజ్‌ కాస్త త‌గ్గిన‌ట్టు క‌నిపించింది. ఇక ఎన్‌టీవీ ముంద‌స్తు క‌వ‌రేజ్ అంత‌గా ఇవ్వ‌లేదు. కానీ యాత్ర ప్రారంభంతో పాటు జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని కూడా లైవ్‌లో బాగా క‌వ‌ర్ చేసింది.

కొన్ని ఛానళ్లు మాత్రం....

ముఖ్యంగా గ‌త వైఎస్ఆర్ పాద‌యాత్ర దృశ్యాల‌తో వీటిని క‌లిపి చూపించ‌డం ఎన్టీవీ క‌వ‌రేజ్‌లో హైలెట్‌. టీవీ 5 ఈ రెండింటితో పోలిస్తే త‌క్కువగానే క‌వ‌ర్‌ చేసింద‌ని చెప్పాలి. హెచ్ ఎమ్ టీవీ, 10టీవీ, స్టూడియోఎన్, మ‌హా టీవీ వంటివి సో…సో అనిపించాయి. ఇక రామోజీతో జ‌గ‌న్ గంట‌సేపు స‌మావేశ‌మైనా అది పెద్ద‌గా ఫ‌లిత‌మివ్వ‌లేద‌ని ఈటీవీ2 క‌వ‌రేజ్ తేల్చేసింది. ఈ ఛానెల్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను త‌న సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా చాలా పొదుపుగా చూపింది. అదే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు ఎన్టీయార్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ప్రారంభ కార్య‌క్ర‌మం కూడా ప్లాన్ చేయ‌డంతో జ‌గ‌న్ యాత్ర నుంచి కెమెరాల‌ను మ‌రోవైపు తిప్ప‌డానికి టీవీ9, ఈటీవీ2… త‌దిత‌ర ఛానెళ్ల‌కు మంచి సాకు దొరికింది. అయితే జ‌గ‌న్‌తో ఉప్పునిప్పుగా ఉండే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో ఈ రోజు మాత్రం ప్ర‌ధాన సంచిక‌లో పాద‌యాత్ర వార్త‌ను ఫొటోతో స‌హా ప్ర‌ముఖంగానే వేశారు.

Similar News