వేదికపైనే వెంకయ్యకు చంద్రబాబు దెప్పిపొడుపులు!

Update: 2016-10-11 15:03 GMT

చంద్రబాబునాయుడు చాలా గుంభనమైన మనిషి. ఏదో ఆవేశం వెల్లువెత్తిపోయిన సందర్భాల్లో తప్ప.. చాలా గుంభనంగా మాట్లాడతారు. అలాంటి చంద్రబాబునాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కేటాయింపులు, మంజూరుల పట్ల ఎంతగా విసిగిపోయి ఉన్నారో మంగళవారం నాడు వెల్లడైంది. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన వేదికమీదినుంచే వెంకయ్యనాయుడు మీద సెటైర్లు వేశారు. ఇంతకూ ఇది ఎలా జరిగిందంటే...

విజయవాడలో పోస్టల్, టెలికాం ఏపీ సర్కిల్ కార్యాలయాలను మంగళవారం ప్రారంభించారు. కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. సహజంగానే ఈ ఇద్దరు పాల్గొన్న ఏ సభలో అయినా పరస్పరం ఒకరిని ఒకరు అత్యంత సమర్థులుగా పొగుడుకుంటూ తమ మాటలను పేర్చుకోవడం అందరికీ తెలిసిన సంగతే. వెంకయ్యనాయుడు , సమర్థత విషయంలో చంద్రబాబును మించిన వారు లేరంటూ.. ఇద్దరూ కలిసి కూచున్న వేదికల మీదనుంచి విపరీతంగా పొగిడేస్తూ ఉంటారు. ఈ తరహా ముఖస్తుతులే తప్ప.. ఒకరి పరోక్షంలో ఒకరు.. అవతలి వారి ఘనతను గురించి చాటిచెప్పిన సందర్భాలు మాత్రం మనకు కనిపించవు.

అయితే మంగళవారం సమావేశంలో వెంకయ్యనాయుడు యథోరీతిగా చంద్రబాబును కీర్తించేశారు. చంద్రబాబు మాత్రం వెంకయ్య తెలుగు రాష్ట్రంనుంచి ఎన్నిక కాకపోయినా.. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరుతూనే.. ‘‘మీకు ఎంత ఇచ్చినా చాలదంటారు’’ అని వెంకయ్య అంటారని, వనరులు లేని రాష్ట్రంగా ఏర్పడిన తమకు ఎంతైనా ఇచ్చినా తక్కువే అని ఆయన పెద్ద మనసుతో గుర్తించాలని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు.

చంద్రబాబు నవ్వుతూ చెప్పారు గనుక.. ఇది సెటైర్ లాగా అందరూ స్వీకరించి నవ్వులు చిందించారు గానీ.. నిజానికి కేంద్రం తూతూమంత్రంగా అందిస్తున్న సాయం గురించి చంద్రబాబు మనసులో ఉన్న కడుపుమంట ఇవాళ ఈ మాటల రూపంలో బయటకు వచ్చిందని పలువురు అనుకుంటున్నారు.

Similar News