వెలగపూడి తలదన్నడమే తొలి ప్రాధాన్యమా?

Update: 2016-10-16 10:55 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నగర నిర్మాణాల కోసం జరుగుతున్నంత హడావిడి ఇక్కడ ఎరగం కానీ.. తెలంగాణలో కూడా గుట్టు చప్పుడు కాకుండా అధికారిక భవనాల నిర్మాణాలు, మరికొన్ని కొత్తవాటికోసం ప్రణాళికలు రెడీ అయిపోతున్నాయి. ఒకరకంగా చూస్తే.. అన్ని రకాలుగానూ ఆంధ్రప్రదేశ్‌ను తలదన్నేలా తమ రాష్ట్రంలోని వ్యవహారాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పడుతున్న తపన కనిపిస్తుంది. ఉమ్మడిగా ఉన్న తెలుగు రాష్ట్రం రెండు ముక్కలు కావడం వలన.. రెండు ప్రాంతాల వారి మధ్య ‘స్పర్ధ’ అనదగిన పోటీ వాతావరణం నెలకొని ఒకరిని మించి ఒకరు పనితీరు కనబరచాలని ప్రభుత్వాలు అనుకోవడం ఇరువురికీ లాభమే చేకూరుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనదగిన వసతులు గానీ, ఆ హోదాకు తగినట్లుగా ఉండవలసిన హుంగులు గానీ అన్నీ శూన్యం. చంద్రబాబునాయుడు కిందా మీద పడుతూ ఒక్కొక్కటీ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అలా చేయడంలోనూ ఆయన రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకుండా అతిశయాలకు వెళుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అది ఒకరకంగా నిజమే కావొచ్చు.. సీఎం క్యాంప్ ఆఫీసు గానీ.. ‘తాత్కాలిక’ అనే ముసుగులో నిర్మించిన వెలగపూడి సచివాలయం కానీ భారీ వ్యయంతో.. అత్యాధునాతన హంగులతో కూడినవి. అయితే అంతర్జాతీయ స్థాయి నగరంగా మనల్ని మనం చాటుకోవాలని అనుకుంటున్నప్పుడు ఈ మాత్రం ఉండాల్సిందే అని చంద్రబాబు చెబుతుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ ను తలదన్నేలా ఉండాలన్నది కేసీఆర్ ప్రయత్నంలా కనిపిస్తోంది.

బెజవాడలో చంద్రబాబునాయుడు తన క్యాంప్ ఆఫీస్ ను అత్యంత ఆధునాతనంగా తీర్చిదిద్దుకున్నారు. కేసీఆర్ హైదరాబాదులో ఉన్న క్యాంప్ ఆఫీస్ బాగా లేదనే నెపంతో కొత్త భవనాన్ని నిర్మించారు. 38 కోట్ల రూపాయల వ్యయంతో .. నభూతో అనదగిన రీతిలో ఆ భవనాలను నిర్మించారు. మరోవైపు,

ఇప్పుడు హైదరాబాదులో సచివాలయం ఉన్న ప్రాంతంలోనే ప్రస్తుతం ఉన్న భవనాలు అన్నింటినీ కూలదోసి.. కొత్త సచివాలయం నిర్మించాల్సందే అని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏపీ వెలగపూడిలో నిర్మించిన సచివాలయాన్ని మించి తెలంగాణ కొత్త సచివాలయం ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. వెలగపూడిలో ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయాన్ని నిర్మించారు. అయితే కేసీఆర్ హైదరాబాదులో భవనాల్ని కూలదోసి కట్టబోయే కొత్త సచివాలయం కనీసం 8 లక్షల చదరపు అడుగులు ఉండాలని మూడు బ్లాకులుగా ఉండాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి వెచ్చించిన ఖర్చు కంటె భారీ వ్యత్యాసంతో 350 కోట్లతో ఈ నిర్మాణాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇలా ఒకరి మీద ఒకరు భవనాల నిర్మాణంలో పోటీ పడుతూ పోతే.. మరి కొన్నేళ్లకు అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణం పూర్తిచేసి చంద్రబాబు అసలు సచివాలయం కట్టే పరిస్థితి వస్తే.. దాన్ని పది లక్షల చదరపు అడుగులకు తీసుకువెళ్తారు. మరి పోటీగా కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తారో ఇప్పుడే ఊహించలేం.

అయినా జనంలో మెదలుతున్న భావన ఏంటంటే.. రెండు ప్రభుత్వాలు కూడా ఒకరిని మించి ఒకరు పనిచేయాలని అనుకోవడం భవనాలు , నిర్మాణాలు వంటి వాటి విషయంలో కాకుండా ప్రజాసంక్షేమం విషయంలో ఉంటే బాగుంటుంది. చంద్రబాబు రెండు విడతలు రుణమాఫీ చేస్తే కేసీఆర్ పూర్తి మాఫీ చేసేసి హీరోయిజం చూపించుకోవాలి. ప్రజలు పోల్చుకుని వారి పాలనను మెచ్చుకునేలా ఉండాలని నాయకులు అనుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది.

Similar News