వెంకయ్య చెప్పింది చాలదా.. జైట్లీ రావాలా?

Update: 2016-10-20 11:35 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాము ఏదో అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చేశాం అని ప్రజలను నమ్మించడానికి భారతీయ జనతా పార్టీ ఇంకా నానా పాట్లు పడుతూనే ఉంది. రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్న ప్రత్యేకహోదా అనే అంశాన్ని పక్కన పెట్టేసి.. తుంగలో తొక్కేసి.. తాము ఇచ్చిన మాటలను గంగలో కలిపేసి.. ప్యాకేజీ అంటూ ఒక మేలిము ముసుగు కప్పిన కానుకను ఏపీకి ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడింది. అయితే అదే చాలా గొప్పది అని ప్రజలు నమ్మేంత వరకు వారు విడిచిపెట్టేలా లేరు. ఇప్పుడు ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా రాష్ట్రానికి వచ్చి ప్రజలకు అర్థమయ్యేలాగా ప్యాకేజీ గొప్పదనం గురించి చెప్పడానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ పెడుతున్నారు. దానికి అరుణ్ జైట్లీ రాబోతున్నారు.

అయితే పాపం.. ప్యాకేజీ ప్రకటించిన నాటినుంచి.. దాని గురించి రాష్ట్రంలోని భాజపా నాయకులంతా పాజిటివ్ గా తమ శక్తివంచన లేకుండా టముకు వేస్తూ వచ్చారు. ప్రత్యేకించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీసుకున్న శ్రమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఆయన ఆ సమయంలో.. తనకు ఎక్కడ మీడియా తారసపడినా , ప్రసంగించే అవకాశం వచ్చినా.. తాను సాధించుకు వచ్చిన ప్యాకేజీ ఎంత గొప్పది అనే విషయాన్ని చాటడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే.. వెంకయ్యనాయుడు మాటలు వినీవినీ ప్రజలకు చిరాకెత్తి పోయేంత వరకు పరిస్థితుల్ని తీసుకువచ్చారు. ఎవరెంత చెప్పినా ప్రజలు ఎంత నమ్మారనేది మాత్రం అనుమానమే.

ఇన్నాళ్లూ రాష్ట్ర నాయకులు, వెంకయ్యనాయుడు అందరూ చెప్పినది కాకుండా... ఇప్పుడు ప్రత్యేకంగా అరుణ్ జైట్లీ వచ్చి చెప్పేది ఏముంటుంది? అసలు తెలుగు ప్రజల వద్ద జైట్లీ కి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి? ఎంతగా ఏపీలో తాము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే కోరిక భాజపాలో ఉన్నప్పటికీ కూడా.. అరుణ్ జైట్లీని తీసుకువచ్చి విజయవాడలో బహిరంగసభ నిర్వహించడం అనేది కొందరు నాయకుల వ్యక్తిగత ప్రాపకానికి తప్ప.. పార్టీకి లాభించే వ్యవహారం కాదని పలువురు అనుకుంటున్నారు.

Similar News