విశాఖ ఎయిర్ పోర్ట్ కు ఊహించని ట్రాఫిక్

Update: 2017-02-28 00:30 GMT

విశాఖ పట్నానికి ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతోంది. స్మార్ట్ సిటీగా అవతరిస్తోన్న విశాఖలో ప్రజలు విమానయానంపైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ పెరగడంతో నైట్ ల్యాండింగ్ కూడా ఇక్కడ అవకాశమేర్పడింది. నైట్ ల్యాండింగ్ కోసం విశాఖ నౌకాదళం నుంచి అనుమతులు కూడా వచ్చేయడంతో సర్వీసులు పెంచేందుకు విమానయాన సంస్థలు పోటీ పడుతున్నాయి. నైట్ ల్యాండింగ్ కు అవకాశం కల్పించడంతో విశాఖ ఎయిర్ పోర్టుకు మరిన్నిసర్వీసులు అతి త్వరలోనే రాబోతున్నాయి.

నైట్ ల్యాండింగ్ కు అనుమతి...

విశాఖలో పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార రంగాలు విస్తరించి ఉండటం ఎయిర్ క్రాఫ్ట్ లకు కలిసివస్తోంది. అంతేకాకుండా వివిధ జాతీయ సంస్థలు కూడా ఇక్కడే ఉండటంతో ఎక్కువ మంది అధికారులు పనులపై వెళ్లేందుకు విమానాల పైనే ఆధారపడుతున్నారు. ఇప్పటి వరకూ విశాఖ ఎయిర్ పోర్ట్ కు నైట్ ల్యాండింగ్ అవకాశం లేదు. దీంతో విమాన సర్వీసులు కొద్దిగానే నడుస్తున్నాయి. అయితే తాజాగా నైట్ ల్యాండింగ్ కు అనుమతులివ్వడంతో ట్రూజెట్ ఎయిర్ వేస్ రెండు విమానాల్సి విశాఖ ఎయిర్ పోర్ట్ లో నిలిపేందుకు అనుమతులను పొందింది. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు ఈ సర్వీసులను నడపనున్నారు. ఒక సర్వీసును మాత్రం విశాఖ నుంచి హైదరాబాద్ కు నడుపుతారు. మార్చి 15 నుంచి హైదరాబాద్ సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశముంది. గతంలో రోజుకు 60 సర్వీసులు మాత్రమే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి వచ్చి వెళుతుండేవి. ఇప్పుడు నైట్ ల్యాండింగ్ కు అవకాశమివ్వడంతో ఆ సంఖ్య 68 కి చేరుకుంది. గతంలో ఎయిర్ ఇండియా ఢిల్లీ, పోర్ట్ బ్లెయిర్ కు వారానికి రెండు రోజులు మాత్రమే సర్వీసులు నడిపేది. తాజాగా ఎయిర్ ఇండియా రోజూ నడుపుతోంది. విశాఖ నుంచి ముంబయికి వెళ్లేందుకు కొత్త ఫ్లైట్ కు త్వరలో అనుమతి వస్తుందనితెలిసింది. అలాగే ఎయిర్ ఏషియా నుంచి మరో విమానం ఢిల్లీకి నడిపేందుకు అనుమతులను పొందింది.

మరిన్ని సర్వీసులు....

నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఉంటే ఎయిర్ లైన్స్ కంపెనీలు తమ విమానాలకు మరమ్మతులు, విడిభాగాలను మార్చుకునేందుకు వీలుంటుంది. వీరికి అవసరమైన వసతిని మాత్రమే ఎయిర్ పోర్ట్ అధారిటీ కల్పిస్తోంది. మరమ్మతులు చేసే ఇంజినీర్లను ఆయా ఎయిర్ లైన్స్ కంపెనీలే నియమించుకోవాల్సి ఉంటుంది. అయితే విశాఖ ఎయిర్ పోర్ట్ అధికారులు మెయిన్ టెనెన్స్ అండ్ రిపేర్ ఆర్గనైజేషన్ కోసం డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కు లేఖ రాశారు. డీజీసీఏ అనుమతి లభిస్తే అది కూడా విశాఖ ఎయిర్ పోర్ట్ కు వచ్చే అవకాశముంది. ఇక విశాఖ నుంచి 24 గంటలూ విమానాలు నడిచే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం టెర్మినల్ సామర్ధ్యాన్ని కూడా పెంచుతున్నారు. ఇప్పుడు టెర్మినల్ సామర్ధ్యం 12 లక్షల మంది ప్రయాణికులు మాత్రమే. దీనిని 35 లక్షల మందికి సరిపోయేలా విస్తరిస్తున్నారు. అలాగే పార్కింగ్ బేల సంఖ్యను కూడా పెంచుతున్నారు. ఎనిమిది పార్కింగ్ బే ల నుంచి 14కు పెంచుతున్నారు. పార్కింగ్ బేలను పెంచడం వల్ల రోజుకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు వంద విమానసర్వీసులు రాకపోకలు సాగించే వీలుంటుంది.

Similar News