విదేశాల్లో సొమ్ము తెస్తేనే, మోదీ సమర్థుడు!

Update: 2016-11-13 23:50 GMT

ప్రధాని నరేంద్రమోదీ జపాన్ నుంచి తిరిగి స్వదేశానికి వచ్చారు. జనం ఇక్కడ ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారు. జనానికి వేరే గత్యంతరం లేక ఈ కష్టాలన్నీ పడుతున్నారు గానీ.. మోదీ తన నిర్ణయాన్ని అందరూ మూకుమ్మడిగా హర్షిస్తున్నట్లుగా దీన్ని చూస్తున్నారనే వాదన కూడా ఒకటి బయల్దేరింది. ఇలాంటి నేపథ్యంలో.. మోదీ నల్ల కుబేరులకు స్వదేశం నుంచి కూడా ఇంకా హెచ్చరికలు చేస్తున్నారు. నల్లధనం పని పట్టడానికి తమ ప్రభుత్వానికి 50 రోజుల సమయం చాలునని, బినామీలతో చెలామణీ అయ్యే నల్లధనం మొత్తాన్ని కూడా వెలికి తీస్తాం అని... మోదీ అంటున్నారు.

పాత పాలకుల అవనీతి సొమ్ము వెలికితీస్తానని, పాత ప్రభుత్వాల మీద వచ్చిన అవినీతి కుంభకోణాల జాబితా పేర్లను ఏకరవు పెడుతూ మోదీ అవన్నీ బయటకు తీస్తా అంటున్నారు. గత 70 ఏళ్లలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీసేస్తా అంటూ కొత్త ప్రతిజ్ఞలు కూడా మోదీ చేస్తున్నారు.

ఇక్కడ ఆయన చెబుతున్నవి అన్నీ చేయడం సాధ్యమే కావొచ్చు గాక.. కానీ.. ఎన్నికలకు ముందు నల్లధనం గురించి చెప్పిన ప్రగల్భాలను కూడా ఆయన ఓసారి గుర్తు చేసుకోవాల్సి ఉంది. విదేశీ బ్యాంకుల్లో నల్లకుబేరులు దాచుకున్న లక్షల కోట్ల రూపాయలను వెనక్కు తీసుకువస్తానంటూ ఆయన డాంబికంగా పలికారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఇప్పటిదాకా ఆయన అలాంటి నల్లకుబేరుల చిటికెన వ్రేలిని కూడా కదిల్చలేకపోతున్నారు. పైగా నల్లధనం అనే మాటతోనే నిమిత్తం లేని అలాంటి ఊసు కూడా తెలియని ఈదేశంలోని, దాదాపు వంద కోట్ల మందికి పైగా ప్రజలను నానాయాతన పెడుతున్నారు. ప్రజలు ఈ యాతనవేదనల్ని భరిస్తున్నారు సరే.. కానీ.. ఇంకా చాలా చేసేస్తానంటూ మోదీ చెబుతున్న ప్రగల్భాలను నమ్మే స్థితిలో వారు లేరు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఏం చేస్తున్నాడో చెప్పకుండా, ఆ నల్లడబ్బును స్వదేశానికి తీసుకురాకుండా.. ఇక్కడి ప్రజలను ఎంత పిండినప్పటికీ జనం నమ్మిక కుదరదు. బడాబాబుల్ని వదిలేసి.. పిచుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించి.. అక్కడికి తానేదో ఉద్ధరించేస్తున్నట్లు మోదీ చంకలు గుద్దుకుంటే ఆయనను చూసి జాలి పడడం తప్ప.. ప్రజలు ఇంకేం చేయగలరు.

Similar News