వార్నింగ్ ఇచ్చింది కూడా కొడుకు మీద ప్రేమతోనేనా?

Update: 2016-10-15 16:39 GMT

దేశ రాజకీయాల్లో రెండు మూడు రోజులుగా కీలకంగా చర్చనీయాంశంగా ఉన్న అనేక విషయాల్లో ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ రాజకీయాలు కూడా ఉన్నాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. తన కొడుకు అఖిలేష్ ను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థి నువ్వు కాదు అంటూ హెచ్చరించడం, పార్టీ గెలిచిన తర్వాత.. ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకుంటారని ప్రకటించడం అనేది.. చాలా కీలకమైన అంశంగా భావిస్తున్నారు. ములాయం కుటుంబంలో కొడుకు , యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం.. ఇలాంటి ట్విస్టు తీసుకున్నదేమిటా అని పలువురు భావిస్తున్నారు.

అయితే కాస్త లోతుగా పరిశీలిస్తే.. ములాయం సింగ్ పైకి తన కొడుకును హెచ్చరించినట్లుగా, సీఎం కుర్చీ నుంచి దూరం పెడుతున్నట్లుగా కనిపిస్తోంది గానీ.. ఈ డైలాగు కొడుకు మీద ప్రేమతో వచ్చినదే అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎందుకంటే.. ములాయం పార్టీకి యూపీలో ఈసారి అసెంబ్లీ అధికారం చేజిక్కించుకోవడం మరీ వీజీగా ఏం లేదు. ఒకవైపు మోదీ, అమిత్‌షా సారథ్యంలో అదికారం దక్కించుకోవడానికి భాజపా చాలా వ్యూహాత్మకంగా వెళ్తోంది. రాష్ట్రంలో ములాయం పార్టీకి పెద్ద సానుకూల సంకేతాలు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకును సీఎం అభ్యర్థిగా ప్రకటించి.. అప్పుడు పార్టీ ఓడిపోతే.. కొడుకు వైఫల్యం కిందికి వస్తుందని.. అలా కాకుండా.. ఇప్పుడు ఓడిపోయినా సరే.. అది ఇతర ఈక్వేషన్స్ ప్రభావంగా ఉంటుంది తప్ప.. కొడుకు కు అపకీర్తి వచ్చే అవకాశం ఉండదని ములాయం ప్లాన్ చేసి ఉంటారని పలువురు అనుకుంటున్నారు.

పార్టీ మునిగితే కొడుకు చరిష్మా మంటగలిసిపోకుండా అలాగే ఉండేందుకే.. ములాయం ఇలా చిన్న పాటి హెచ్చరిక చేశారనేది అంచనా. అదే నిజమైతే.. ఇన్నాళ్లు ఏలుబడి సాగించిన పార్టీకి కూడా తిరిగి గెలుస్తామన్న కనీసం నమ్మకం లేకుండాపోతోందన్న మాట.

Similar News