వాణీ పాలిటిక్స్ అంటే వాన‌పాట కాద‌మ్మా..!

Update: 2017-11-11 04:30 GMT

రాజ‌కీయం అన్నాక‌.. కాసింత లౌక్యం, ఒకింత ఓర్పు, మ‌రికాస్త దూకుడు త‌ప్ప‌దు! అలాగ‌ని వీటిని అదే ప‌నిగా చేసుకుంటూ, చూపించుకుంటూ పోయినా ప్ర‌మాద‌మే! గ‌తంలో ఎంతో మంది నేత‌లు ఇవి లేకే.. చ‌తికిల ప‌డ్డారు. ముఖ్యంగా కొత్త‌గా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చే నేత‌లైతే.. ఈ మూడు విషయాల్లో పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా టీడీపీ సైకిల్ ఎక్కుతున్న మాజీ హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్ ఎంట్రీ, త‌ర్వాత సంగ‌తులు వంటివి తెర‌మీద‌కి వస్తున్నాయి కాబ‌ట్టి! నిజానికి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఎదుర్కొనేందుకు టీడీపీ అధినేత సంధిస్తున్న బాణ‌మే వాణీ!

డైలాగులు కాదమ్మా....

టీడీపీ నుంచి తెర‌చాటు ఆహ్వానం అంద‌గానే వాణీ గంతులేసింది. ఎన్టీఆర్ తో ఉన్న సంబంధాల నుంచి చంద్ర‌బాబు పాల‌న వ‌ర‌కు ఎన్నెన్నో క‌బుర్లు చెప్పింది. తాను ఖ‌చ్చితంగా రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని, అది కూడా టీడీపీలో చ‌క్రం తిప్పుతాన‌ని ఆమె చెప్పుకొచ్చింది. అదేస‌మ‌యంలో బాబు ఆమెను ఎందుకు ర‌మ్మంటున్నారో కూడా చూచాయ‌గా చెప్పేసింది వాణీ. వైసీపీపై పోరుకు తాను సిద్ధ‌మేనని చెప్పింది. అంతేకాదు, రోజాపై పోటీకి దిగ‌మంటే ఏమాత్రం త‌డుముకోకుండా దిగిపోయి.. రోజాను మ‌ట్టిక‌రిపిస్తానంటూ.. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగుల రేంజ్‌లో కామెంట్లు కుమ్మ‌రించింది.

గాలి ఊరుకుంటుందా?

వినేందుకు ఇవి బాగానే ఉన్నాయి. కానీ, ఆమె పూర్తిగా రాజ‌కీయాల్లోకి రాలేదు. వ‌చ్చాక కానీ అస‌లు విష‌యం బోధ‌ప‌డదు అంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. ఇప్ప‌టికిప్పుడు వాణీ రాజ‌కీయంగా ఎదుర్కొనాల్సిన‌, గ‌ట్టిగా స‌మాధానం చెప్పాల్సిన నేత రోజా. కానీ, రాజ‌కీయంగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటే.. సొంత పార్టీలోని ఒక‌రిద్ద‌రు నేత‌ల నుంచి కూడా వాణీకి ఆటుపోట్లు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. రోజాను ఢీకొంటాన‌ని చెబుతున్న వాణీ.. చేస్తే గీస్తే.. 2019 ఎన్నిక‌ల్లో.. న‌గ‌రి నుంచే పోటీ ప‌డాలి. ఇక్క‌డే రోజా ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబ‌ట్టి ఆమెను ధీటుగా ఎదుర్కోవాలంటే.. వాణీకి న‌గ‌రి ఎంట్రీ త‌ప్ప‌దు. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం.. టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడిది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న రోజా చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని దింపి.. రోజాపై క‌సితీర్చుకోవాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆయన బూత్ లెవల్ ల్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు వాణీ మూలంగా ఈ సీటు త‌న‌కు ద‌క్క‌ద‌ని తెలిస్తే.. వాణీపై రోజా క‌న్నా ఎక్కువ రేంజ్‌లో ఫైర‌య్యే ఛాన్స్ క‌నిపిస్తోంది. దీంతో వాణీ ఇక్క‌డ పోటీకి దిగినా కిందిస్థాయి కేడ‌ర్ గాలి చేతిలో ఉంటుంది కాబ‌ట్టి స‌హ‌కారం ల‌భించే ఛాన్స్ లేదు. సో.. వాణీకి అప్పుడు రోజా క‌న్నా గాలి బృందం ప్ర‌త్య‌ర్థులుగా మార‌తార‌న‌డంలో సందేహం లేదు.

అనుకున్నంత వీజీ కాదు....

అదేవిధంగా వాణీకి మిగిలిన నేత‌లు కూడా క‌లిసొచ్చే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం ఆమె ఇప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న నేత‌. ఆమె మాట‌ను ఎవ‌రూ విని ఫాలో అయ్యే చాన్స్ క‌నిపించ‌దు. చంద్ర‌బాబు స‌హ‌క‌రించాలంటూ... నేత‌ల‌కు ఆదేశాలిచ్చినా అమ‌రావ‌తి దాట‌గానే అవి బుట్ట‌దాఖ‌ల‌వుతాయి. సో.. వాణీ.. అనుకున్నంత తేలిక‌గా రోజాపై గెలుపు సాధ్యం కాదు. ఇక‌, అదేస‌మ‌యంలో ఈ వివాదాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో రోజా ఎప్ప‌టిక‌ప్పుడు రెడీనే. రోజా గ‌త 12 ఏళ్లుగా పాలిటిక్స్‌లో త‌ల‌పండిపోయి ఉంది. ఇలా ఎలా చూసినా.. వాణీకి రాజ‌కీయాలు అంత వీజీకాద‌ని అర్ధ‌మ‌వుతోంది. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.

Similar News